రామగిరి, జనవరి 4 : విద్యకు పెద్దపీఠ వేస్తున్న తెలంగాణ సర్కార్ ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. ప్రభుత్వ చర్యలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కట్టడంతో విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే ప్రస్తుత విద్యా సంవత్సరం పెరిగినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రతి విద్యార్థికి న్యాయం చేసేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టితో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా విద్యాహక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలనే నిబంధనను పక్కా అమలు చేసి విద్యా తెలంగాణగా తీర్చిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
బడి ఈడు పిల్లలు, బడి మానేసిన పిల్లలను గుర్తించి తిరిగి బడుల్లో చేర్పించి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేసేందుకు 2023-24 విద్యా సంవత్సరానికై బడి బయటి పిల్లల సర్వేకు శ్రీకారం చుట్టింది. 6 నుంచి 14 ఏండ్లు అలాగే 15 నుంచి 19 సంవత్సరాలు కలిగి ఉండి బడికి వెళ్లని వారి గుర్తింపునకు ప్రత్యేక సర్వేను చేపట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3న ప్రారంభమైన సర్వే 25వ తేదీ వరకు కొనసాగనున్నది. సర్వే వివరాలను ‘ప్రబంధ పోర్టల్’లో నమోదు చేయాల్సి ఉన్నది. ఇందుకు క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్(సీఆర్పీలు) ఆయా క్లస్టర్ కాంప్లెక్స్ పాఠశాలల పరిధిలో పక్కాగా సర్వే నిర్వహించి ఫలితం స్పష్టం చేసేలా పని చేస్తున్నారు. జిల్లాలోని ఎంఈఓ, డీఎల్‌ఎంటీ, సీఆర్పీలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్స్‌కు సర్వేపై అవగాహన శిక్షణ నిర్వహించారు. ప్రణాళిక మేరకు ‘బడి బయట ఉన్న పిల్లల’ వివరాలు గుర్తించి ఆన్లైన్లో (చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్), ప్రబంధ పోర్టల్‌లో నమోదు చేసే దిశగా జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 ( నల్లగొండ-31, సూర్యాపేట-23, యాదాద్రి-17) మండలాల ఎంఈఓలు, క్లాంప్లెక్స్ హెచ్ఎం, సీఆర్‌స్పీలు, డీఎల్ఎంటీలు, ఐఈఆర్టీలకు అవగాహన -శిక్షణను జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష ద్వారా అందించారు. అంతే కాకుండా సర్వే నిర్వహణ, వివరాల సేకరణపై సలహాలు, సూచనలు తెలిపారు. ఈ నెల 3, 5న సమన్వయ సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే 6 నుంచి 18 వరకు సర్వే చేసి గుర్తించిన బడి బయటి పిల్లల వివరాలను ఎంఆర్సీకి 25న అందచేస్తారు. అక్కడి నుంచి డీఈఓ కార్యాలయాలనికి ఈ నెల 31 పంపించనున్నారు.
2021-22 విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వే ద్వారా 771 మంది బడి బయటి పిల్లలను విద్యాశాఖ గుర్తించింది. నల్లగొండలో 261 మంది పిల్లలను గుర్తించగా వీరిలో 217 మందిని ఆయా ప్రాంతాల్లోని సమీప పాఠశాలల్లో చేర్పించారు. మిగతా 44 మంది తల్లిదండ్రులతో కలిసి వారి రాష్ర్టాలకు వెళ్లారు. అలాగే సూర్యాపేటలో 212 మందిని గుర్తించగా 198 మందిని స్కూల్స్‌లో చేర్పించారు. 14 మంది తల్లిదండ్రులతో కలిసి స్వస్థలాలకు వెళ్లారు. యాదాద్రిలో 298 మంది పిల్లలను గుర్తించగా 236 మందిని సమీప బడుల్లో చేర్పించారు. 62 మంది తమ తల్లిదండ్రులతో కలిసి సొంత రాష్ర్టాలకు వెళ్లారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 251 మంది సీఆర్పీలు సర్వేలో నిమగ్నమయ్యారు. వీరిలో నల్లగొండలో 113, సూర్యాపేటలో 79, యాదాద్రిలో 59 మంది సీఆర్పీలు ఉన్నారు. తల్లిదండ్రుల పని, పిల్లలు బడికి వెళ్లకపోవడానికి కారణాలు, ఎంతవరకు చదివి మానేశారు, జీవనోపాధికి ఇతర ప్రాంతాలకు వెళితే చదువులు మధ్యలోనే ఆపేసిన వారి పిల్లల వివరాలు ఇలా 28 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సర్వే చేయనున్నారు. సీడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు కూడా ఉంటే నిర్ధారణ చేయాల్సి ఉన్నది. వీరిని గుర్తించి బడుల్లో చేర్పించడమే బడి బయటి పిల్లల సర్వే లక్ష్యం.
పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి ఈ నెల 3 నుంచి 31 వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బడి బయటి పిల్లల గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నాం. సర్వే నిర్వహణకు అధికారులను సన్నద్ధం చేశాం. సర్వేలో గుర్తించిన విద్యార్థులను వచ్చే విద్యా సంవత్సరం బడిలో చేర్పించి విద్య అందిస్తాం. అందరికి విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందరి సహకారంతో అమలు చేస్తాం.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ