– డివిఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.గంగాధర్ రావు
రామగిరి, సెప్టెంబర్ 05 : గురువే నిజమైన సమాజ నిర్మాతని, ఆ దిశగా ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అనిర్వచనీయమని డివిఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.గంగాధర్ రావు అన్నారు. నల్లగొండలోని చర్లపల్లిలో గల డివిఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శనివారం కళాశాల M.Ed ప్రథమ సంవత్సరం (2025-27 బ్యాచ్) శిక్షణ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కళాశాల ఆడిటోరియంలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కళాశాల వైస్ ప్రిన్సిపాల్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బొడ్డుపల్లి రామకృష్ణతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో అత్యంత పవిత్రమైనదని, భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అసమానమైనదని కొనియాడారు. కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులలో నైతిక విలువలను, సత్ప్రవర్తనను పెంపొందించే బాధ్యత గురువులపై ఉందన్నారు. నేటి శిక్షణ ఉపాధ్యాయులు రేపు సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు.

‘గురువే నిజమైన సమాజ నిర్మాత’
ఉపాధ్యాయ దినోత్సవం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, గురుశిష్య సంబంధాల గొప్పతనాన్ని చాటిచెప్పే సుదినమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు నిరంతర అభ్యాసకులుగా (నిరంతర విద్యార్థులుగా) ఉంటూ సరికొత్త బోధనా పద్ధతులను ఆకసలించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఎం డైట్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్. శ్రీదేవి, ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ జై.పుష్పాంజలి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బి.కన్నయ్య, విజయ్, సీనియర్ అధ్యాపకులు ఆర్.సత్యనారాయణ, మేడిపల్లి రవి, ఎ.సరిత, డివిఎం విద్యాసంస్థల సూపరింటెండెంట్ చోలేటి శ్రీధర్ ఆచారి, జె.విజయలక్ష్మి, పి.శ్రీధర్ రెడ్డి, లైబ్రరియన్ వెంకటేశ్వర్లు, సిబ్బంది బి.వీరప్ప, సాలమ్మ, లక్ష్మమ్మ, చంద్రకళ, సంజన, ఎంఈడి విద్యార్థులు పాల్గొన్నారు.