ప్రత్యేక పాలనలో కోదాడ మున్సిపల్ అధికారులు బిల్లుల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అందినకాడికి నిధులు డ్రా చేశారు. అయితే ప్రస్తుతం మున్సిపల్ అధికారుల మధ్య ఆధిపత్య పోరుతో గత సంవత్సర కాలంగా వివిధ శాఖల అధికారులు నిధులు ఎలా బిల్లుల రూపంలో డ్రా చేశారో లీకులు ఇస్తుండటంతో అవినీతి బిల్లుల బాగోతం ఒక్కొక్కటిగా బయపడుతోంది. నూతన పాలక వర్గాన్ని అభినందించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఆయన అక్కడ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ఇందుకుగాను టీ, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు, బోకేలకు గాను రూ. 42వేల ఖర్చయినట్లు ఏకంగా బిల్లులు పెట్టారని పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.
కోదాడ రూరల్, ఏప్రిల్ 25 : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రూ.60 లక్షల ఖర్చు చేసినట్లు అధికారులు బిల్లులు పెట్టారు. ఈ ఖర్చుపై సరైన ఆడిటింగ్ లేకపోవడంతో భారీ మొత్తంలో బోగస్ బిల్లులు పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ బిల్లులను అకౌంట్ సెక్షన్లో ఉన్న వారితో పాటు మరో ఉద్యోగి పెట్టారని, తమను సంప్రదించలేదని ఎన్నికల విధుల్లో పాలుపంచుకున్న ఇతర అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో బిల్లులు విషయమై బయటకు లీకులు ఇస్తున్నారు. ఈ విషయమై అధికారుల మధ్య పోరు తారస్థాయికి చేరింది. దీంతో మున్సిపాల్టీలో కొంత మందికి స్థాన చలనం కలిగించి పాలనను గాడిలో పెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
డ్రైవర్‌గా అవుట్సోర్సింగ్ ఉద్యోగి
కోదాడ మున్సిపాల్టీలో ఉన్నతాధికారి ఒకరు కారు అలవెన్స్ కింద ప్రతి నెలా రూ.33వేలు తీసుకుంటున్నారు. అదే అధికారి మున్సిపల్ అవసరాల కోసం అవుట్సోర్సింగ్ ద్వారా నియమించిన డ్రైవర్‌ను తన కారు డ్రైవర్‌గా వినియోగించుకుంటున్నారని సమాచారం. కాగా ఏజెన్సీ ద్వారా సదరు డ్రైవర్‌కు నెల జీతంగా రూ.17వేలు చెల్లిస్తున్నారు.
విధులకు హజరు కాకున్నా ఐదేళ్ల పాటు వేతనం
శానిటేషన్ విభాగంలో పనిచేసి కొద్ది నెలల క్రితం ఉద్యోగ విరమణ చేసిన అధికారి ఒకరు.. తన కుమారుడిని అవుట్ సోర్సింగ్ ద్వారా మున్సిపాల్టీలో నియమించారు. సదరు వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగానికి హాజరు కాకున్నా అతడి పేరున ప్రతి నెలా వేతనం డ్రా చేస్తున్నట్లు సమాచారం. అలాగే గత సంవత్సరం మున్సిపాల్టీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ నుంచి ఉచితంగా ఇప్పించారు. అయితే వీటికి రవాణా ఖర్చు పేరుతో రూ.12లక్షల బిల్లు పెట్టినట్లు తోటి ఉద్యోగులే ఆరోపిస్తున్నారు.
జీఎస్టీ చెల్లించకుండా వీధి దీపాలకు రూ.49 లక్షలు
గత ఎనిమిది నెలల క్రితం నామినేషన్ పద్ధతిలో రూ.49 లక్షల మేర వీధి దీపాలు కొనుగోలు చేశారు. కానీ జీఎస్టీ చెల్లించకుండా బిల్లు పెట్టి నిధులు డ్రా చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా కోదాడ మున్సిపాల్టీలోని ప్రతి విభాగంలో అవినీతి కంపు కొడుతున్నది. గతంలో అవసరం లేకున్నా కమీషన్ల కోసం పనికి రాని అనేక వాహనాలను, వస్తువులను కొనుగోలు చేశారని, వాటిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.