నీలగిరి, జనవరి 6 : నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ రాష్ట్ర శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది. దీంతో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న నల్లగొండ పట్టణం మహానగరంగా రూపాంతరం చెందనుంది. మున్సిపాలిటీ కాస్తా మహానగరంగా మారడంతో చైర్మన్..మేయర్‌గా..కౌన్సిలర్లు కార్పోరేటర్లు కానున్నారు. ఇందుకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన జీవో మరో రెండు రోజుల్లో గవర్నర్ అమోదంతో వెలువడునున్నది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో అమోదించిన తరువాత డివిజన్ల విభజన లేదా అదే కౌన్సిలర్ స్థానాల్లో డివిజన్లు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
అయితే ఇతర గ్రామాల వీలీనం లేకుండానే 48 వార్డుల పరిధిలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. శివారు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతూ పట్టణీకరణ పెరగడంతో ఇటీవల నిర్వహించిన సర్వే(2022)లో 2.25 లక్షల జనాభా ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. పెరిగిన పట్టణీకరణతో సుమారు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిధిని తీసుకుని మహానగరంగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఇదిలా ఉండగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు గత రిజర్వేషన్ల ప్రకారమే మున్పిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తారని అశించి పెద్ద ఎత్తున ఖర్చు చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుత అసెంబ్లీ తీర్మానంతో రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో తమ డివిజన్ ఎలా ఉంటుందో. .మార్పులు చేర్పులు ఎలా వస్తాయో రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనని పదవులు అశించిన అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
నల్లగొండ మున్సిపాలిటీ మహానగరంగా మారింది. నల్లగొండను 1951లో మున్సిపాలిటీగా 12 వార్డులతో గ్రేడ్-3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జనాభా పెరగడం, పట్టణం క్రమంగా విస్తరించడంతో 1987లో 24 వార్డులతో గ్రేడ్-2గా 2005లో 36 వార్డులతో గ్రేడ్-1గా అప్ గ్రేడ్ చేశారు. తెలంగాణ రాకముందు 2011 సంవత్సరంలో నల్లగొండ మండలంలోని ఆరు గ్రామ పంచాయతీలైన ఆర్జాలబావి, మర్రిగూడ, చర్లపల్లి, శేషమ్మ గూడెం, అక్కలాయిగూడెం, మామిళ్లగూడెం, తిప్పర్తి మండలంలోని కేశరాజుపల్లి గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని మరో పది అవాస గ్రామాలను వీలీనం చేస్తూ 48 వార్డులుగా విస్తరించారు.
2018 ఫిబ్రవరి 3న గ్రేడ్-1 మున్సిపాలిటీగా ఉన్న నల్లగొండ మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. ప్రస్తుతం నల్లగొండ మున్సిపాలిటీలో 2.50 లక్షల మేర జనాభా ఉండటంతో నాలుగు నుంచి ఐదువేల జనాభాను తీసుకుని డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. ఏటా రూ.20 కోట్ల ఆదాయం ఉన్న మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. కాగా నల్లగొండ మున్సిపాలిటీ అదాయం ఏటా రూ.40 కోట్లకు పైగానే ఉంది.
మంగళవారం అసెంబ్లీలో నల్లగొండ మన్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించిన అనంతరం మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలతో కార్పొరేషన్‌కు సంబంధించిన జీవో వెలువడనుంది. మున్సిపాలిటీ కాస్తా మహానగరంగా మారడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కూడా పెద్ద ఎత్తున రానున్నాయి.
నల్లగొండ పట్టణం కార్పొరేషన్‌గా మారితే కౌన్సిలర్ల స్థానంలో కార్పొరేటర్లు రానున్నారు. కాగా వారం రోజుల క్రితం ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా నల్లగొండ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఓటరు ముసాయిదా జాబితాను సైతం విడుదల చేశారు. 48 వార్డులు ఉన్న మున్సిపాలిటీని వార్డుల వారీగా విభజించి ముసాయిదా ప్రకటించారు. దీంతో అయా వార్డుల్లో కొంతమంది ఆశావహులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ అన్నీ సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చడంతో రిజర్వేషన్లు కూడా మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీలోని 48 వార్డులకే ఎన్నికలు నిర్వహిస్తారా.. లేక వార్డులు పెంపు.. తగ్గింపు ఉంటుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
నల్లగొండ మున్సిపాలిటీగా మారినప్పడు వార్షిక బడ్జెట్ కేవలం రూ.10 వేలు మాత్రమే ఉంది. పెరిగిన వలసల కారణంగా పట్టణ జనాభా పెరుగుతూ రావడంతో ప్రస్తుతం నల్లగొండ పట్టణం రోజు రోజుకు విస్తరిస్తూ వచ్చింది. అంతేగాకుండా పరిశ్రమలు, కాలనీలు, రియల్ ఎస్టేట్ రంగం విస్తరించింది. 107 చదరపు కిలోమీటర్లు ఉన్న మున్సిపాలిటీ ప్రస్తుతం 200 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది.
రూ.10వేల వార్షిక ఆదాయం ఉన్న మున్సిపాలిటీ ఆదాయం ఈ 74 సంవత్సరాల కాలంలో రూ.40 కోట్లకు పైగా పెరిగింది. కార్పొరేషన్ అయ్యేందుకు రూ.20 కోట్ల వార్షిక ఆదాయంతో పాటు 2లక్షల జనాభా ఉంటే సరిపోతుంది. అయితే నల్లగొండ పట్టణ వార్షికాదాయం రూ. 40 కోట్లకు చేరింది. అలాగే జనాభా కూడా 2.5లక్షలకు పెరగడంతో ప్రభుత్వం నల్లగొండ పట్టణాన్ని తప్పకుండా మహానగరంగా మారుస్తుందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.