దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఎందరికో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అవసాన దశలో ఆత్మీయతను పంచి మంచి వైద్యం అందించేందుకు ఉద్దేశించిన పాలియేటివ్ కేర్ రోగులకు వరంగా మారింది. చౌటుప్పల్‌లో కిందట ఏర్పాటుచేసిన ఈ సెంటర్ రోగులను అక్కున చేర్చుకుంటున్నది. ఖరీదైన వైద్యం, నాణ్యమైన ఆహారం అందిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నది. ఈ పాలియేటివ్ కేర్‌లో ఇప్పటివరకూ 1,263 మంది ఇన్‌పేషెంట్‌గా సేవలు పొందగా, మరో 1,200 మంది హోమ్‌కేర్ చికిత్స తీసుకుంటున్నారు.
చౌటుప్పల్ రూరల్, జనవరి 28 : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలోని ప్రత్యేక విభాగంలో 2018 జూలైలో 7 పడకలతో పాలియేటివ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఈ సెంటర్ రెండవది. తర్వాతనే అన్ని జిల్లా కేంద్రాల్లో విస్తరించాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న రోగులకు దీని ద్వారా నాణ్యమైన సేవలు అందుతున్నాయి. 24 గంటలు ప్రతినిత్యం రోగులకు అందుబాటులో ఉంటుంది. పాలియేటివ్ మెడికల్ అధికారితోపాటు ముగ్గురు స్టాఫ్ నర్సులు, మరో ముగ్గురు ఇతర సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు.
రోజూ ఈ కేంద్రం ద్వారా 10-15 మంది రోగులకు అవుట్ పేషెంట్ సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా 5-6 మందికి ఇన్‌పేషెంట్ చికిత్సలు చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన అన్ని రకాల క్యాన్సర్లు, థైరాయిడ్, పక్షవాతం, డయాబెటిక్, నొప్పులతో ఇబ్బంది పడేవారికి వైద్యసేవలు అందిస్తున్నారు. తాత్కాలికంగా దమ్ము, వాంతులు ఆగిపోయేలా మందులు ఇస్తారు. సమస్యలు తగ్గిన తర్వాత వారు ఇంటికి వెళ్లి వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతారు. తిరిగి ఇబ్బందులు ఎదురైతే మళ్లీ సెంటర్‌కు వచ్చి అడ్మిట్ అవుతారు. నడువ లేని రోగులకు ఇంటికి వెళ్లి హోంకేర్ సేవలు సైతం అందిస్తున్నారు. దీనిలో పాలియేటివ్ మెడికల్ అధికారి, స్టాఫ్ నర్స్, సిబ్బంది ఉంటారు. పేషంట్ల ఇబ్బందులకు తగ్గట్టు మందులు అందజేస్తారు. రోగులకు మనోధైర్యం కల్పిస్తారు.
ఇక్కడ ఆడ్మిట్ అయిన ప్రతి రోగికి నిత్యం పాలు, బ్రెడ్డు, ఆరటి పండు, గుడ్డు అందిస్తారు. మింగలేని రోగులకు స్పెషల్‌గా రాగి జావ, అన్నం అన్నిరకాల కూరగాయలు వడ్డిస్తారు. రోగులతోపాటు వారి సంరక్షకుడికి సైతం భోజన వసతి కల్పిస్తారు. ఈ సెంటర్లోని రోగుల ఆసక్తిని బట్టి అల్లికలు, కుట్లు, చిత్రలేఖనం తదితర గేమ్స్ పెడుతారు.
ఈమె పేరు పండాల రాములమ్మ. భూదాన్‌పోచంపల్లి మండలం గోసుకొండ గ్రామం. నిరుపేద వ్యవసాయ కుటుంబం. కొంతకాలంగా గర్భసంచి(క్యాన్సర్ ఆఫ్ సర్విక్స్)తో బాధపడుతున్నది. ఇంతకుముందు హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందింది. ఈమెకు ఒక్కొక్కసారి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. దాంతో పదే పదే హైదరాబాద్‌కు వెళ్లి చికిత్స చేసుకోవాలంటే భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు సైతం వెంటాడాయి. దాంతో చౌటుప్పల్ పాలియేటివ్ కేర్ యూనిట్‌కు గత మార్చిలో వచ్చింది. అక్కడ ప్రతి నెలా 10రోజుల పాటు ఉంటూ వైద్య చికిత్సలు పొందుతున్నది. ఇలా 10 నెలల నుంచి ఆమెకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యం అందిస్తున్నారు. దీంతో ఆమెకు ఎంతో ఉపశమనం కలుగుతున్నది. అంతేకాకుండా ప్రతిరోజూ రాగిజావ, పాలు, అన్నం అందిస్తున్నారు. ఐరన్మాత్రలతోపాటు కడుపునొప్పి, విరోచనాలకు క్రమం తప్పకుండా మాత్రలు ఇస్తున్నారు.
జీవితం చరమాంకంలో ఉన్నవారికి ఈ కేంద్రం ద్వారా సరైన వైద్యసేవలు అందిస్తున్నాం. కుటుంబ తరహాలో వారిని చూసుకుంటున్నాం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులను పాలియేటివ్ సెంటర్లో ఆడ్మిట్ చేసుకొని చికిత్సలు చేస్తున్నాం. దాంతో తాత్కాలికంగా ఉపశమనం పొందుతారు. తర్వాత ఇంటికి వెళ్లి కుటుంబంతో ప్రశాంతంగా గడుపుతున్నారు. జీవన ప్రమాణం పెరుగుతుంది. మళ్లీ ఏదైనా ఇబ్బంది వస్తే సెంటర్‌కు వస్తారు. నడువలేని రోగులకు ఇంటికి వెళ్లి చికిత్సలు చేస్తున్నాం.
-చింతకింది కాటంరాజు, పాలియేటివ్ మెడికల్ ఆఫీసర్
నాపేరు బొల్ల యాదమ్మ, రామన్నపేట మండలం తుమ్మలగూడెం. గత 6 ఏండ్లుగా మూత్ర సంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నా. మస్తు పైసలు పెట్టి పెద్ద పెద్ద దవాఖానల్లో చూపించుకున్నా రోగం నయం కాలే. కాళ్ల నొప్పులు బాగా వస్తున్నాయి. ప్రైవేట్ దవాఖానకు వెళ్తే పైసలు చాలా అయ్యేవి. ఇది పెట్టినప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నా. ఇక్కడ డాక్టర్ మంచిగా మందులు ఇస్తరు. అందరూ బాగా చూస్తరు.
-బొల్ల యాదమ్మ, రామన్నపేట
థైరాయిడ్‌తో చాలా దినాల నుంచి బాధపడుతున్నా. ఏదైనా తినాలంటే మింగలేకపోతున్నా. దమ్ము, ఆయాసం బాగా వస్తది. అలా రాగానే దవాఖానకు వస్తా. ఇక్కడ కొన్ని రోజులు ఉంచుకొని మందులు ఇస్తరు. తగ్గిన తర్వాత మళ్లీ ఇంటికి పోతా. డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతా. నాకు మింగడం కష్టమని రాగి జావ, పాలు ఇస్తుండ్రు.
-పస్తం బాలయ్య, చౌటుప్పల్