త్రిపురారం, ఏప్రిల్ 23 : వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా తరలి రావాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. త్రిపురారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన మండల ముఖ్య నాయకుల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను వరంగల్ సభ ద్వారా ఎండగట్టడానికి ప్రతి ఇంటి నుంచి తరలి రావాలని పిలుపునిచ్చారు.
27న ఉదయం 8గంటల వరకు అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు హాలియా పట్టణానికి చేరుకోవాలన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులకు కేసీఆర్ సభ ద్వారా దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలు తప్ప చేతలు లేవని, హామీల అమలుపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే నేడు కాంగ్రెస్ పాలనలో కుంటుపడిందని మండిపడ్డారు.
గ్రామాల్లో ఇప్పటికే 80శాతం ప్రభుత్వం మీద వ్యతిరేకత కొనసాగుతుందని, ఈ సభ అనంతరం ప్రజలు తిరగబడడం ఖాయమని తెలిపారు. మాజీ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్‌నాయక్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పాలనలో ఏ ఒక్కరు కూడా సుభిక్షంగా లేరని, రైతులకు రుణమాఫీ సరిగా చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎండగట్టేందుకే రజతోత్సవ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రజతోత్సవ సభతో తెలంగాణలో కొత్త మార్పు వస్తుందని చెప్పారు. సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కామర్ల జానయ్య, బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు పామోజు వెంకటాచారి, గగ్గనపల్లి వనజ, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ గుండెబోయిన వెంకటేశ్వర్లు, నాయకులు బాబురావునాయక్, కలకొండ వెంకటేశ్వర్లు, మడుపు వెంకటేశ్వర్లు, సుశీల్నాయక్, శ్యాంసుందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కొణకంచి సత్యం పాల్గొన్నారు.