విద్యార్థుల్లో శాస్త్రీయ నైపుణ్యాలు పెంపొందించేలా చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేలా ‘ఇన్స్పైర్ మానక్ అవార్డు’ ప్రదర్శనలు వేదికగా నిలుస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమస్యలను పరిష్కరించేలా ఆయా పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఆయా వివరాలతో ఆన్లైన్లో ప్రదర్శించగా సంబంధిత అధికారులు పరిశీలించి జనవరిలో జరుగనున్న రాష్ట్రస్థాయి ప్రదర్శనలకు ఎంపిక చేశారు.
ైగ్లెడింగ్ స్పెక్టికల్స్
డిండి: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ 10వతరగతి విద్యార్థిని ఏటూరి ప్రణవ సైన్స్ టీచర్ అంజయ్య పర్యవేక్షణలో ైగ్లెడింగ్ స్పెక్టికల్స్ రూపొందించింది. ఎదురుగా ఏదైనా వస్తువు ఉన్నా, ఏదైనా వచ్చినా రెండు మీటర్ల దూరంలోనే బీప్ శబ్దంతో అలర్ట్ చేస్తుంది. ఈ పరికరంలో రెండు మీటర్లు, మీటరు, అరమీటరు దూరం అలర్ట్ ప్రోగ్రాం సెన్సార్‌ను అడ్జస్ట్ చేసుకునే అకాశం ఉంది. స్పెక్టికల్స్, అర్డ్యునోనానో సెన్సార్, బజర్, బ్యాటరీ, స్విచ్, కనెక్టింగ్ వైర్ పరికరాలను అమర్చారు.
ఫర్టిలైజర్ గన్
నేరెడుగొమ్ము(చందంపేట) : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి నేనావత్ మకట్ లాల్ ఫర్టిలైజర్ గన్ను తయారు చేశాడు. ఈ గన్‌తో జొన్న, సజ్జ, మక్క పంటలకు ఎరువులను సులభంగా వేసుకోవచ్చు. ఇంధనం, విద్యుత్ శక్తి అవసరం లేకుండా మహిళా రైతులు సైతం ఈ పరికరాన్ని వినియోగించవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో తయారు చేసుకునే విధంగా ఉపాధ్యాయురాలు డి. సుజాత సహకారంతో రూపొందించినట్లు విద్యార్థి తెలిపాడు.
ప్రమాదాలకు హెచ్చరిక ..
నందికొండ : హిల్‌కాలనీ బాలికోన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని బి.నాగమల్లేశ్వరి ప్రమాద హెచ్చరిక సూచిక(ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అన్ ఘాట్ రోడ్స్ బై ట్రాఫిక్)ను రూపొందించింది. ఘాట్ రోడ్లలో ట్రాఫిక్స్ సిగ్నల్స్ సహాయంతో డ్రైవర్లను అప్రమత్తం చేయడం ద్వారా ప్రమాదాలను నివారించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఈ పరికరం ఉపయోగించడం ద్వారా ఘాట్ రోడ్డు మూల మలుపుల్లో ఎదురెదురుగా వాహనాలు వస్తున్నట్లయితే సిగ్నల్‌తో పాటు సౌండ్ వస్తుంది. దాంతో వాహనాల డ్రైవర్లు అప్రమత్తమై ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది.
పోర్టబుల్ స్టిక్ చైర్
నాంపల్లి : మండలంలోని పెద్దాపురం మోడల్ స్కూల్ విద్యార్థి కొండూరు శివ ప్రసాద్ వృద్ధులు, దివ్యాంగుల కోసం పోర్టబుల్ స్టిక్ చైర్ రూపొందించాడు. ఎక్కువ సేపు నిలబడలేని పరిస్థితుల్లో బోల్ట్, స్క్రూలు, ప్లేటు, వాకింగ్ స్టిక్ ఉపయోగించి పోర్టబుల్ స్టిక్చైర్ను తయారు చేశాడు. దాంతో స్టిక్ సాయంతో నడుస్తున్న వారు సైతం ఎప్పుడంటే అపుడు చైర్‌గా మార్చుకొని కూర్చోవచ్చు. ఈ పరికరం తేలికగా కూడా ఉంటుంది కాబట్టి ప్రయాణాల్లోనూ ఉపయోగించవచ్చు.
వెంటిలేటర్ మాస్క్
కేతేపల్లి : మండల పరిధిలోని కొర్లపహాడ్ జడ్పీహెచ్ఎస్ ఎస్ఎస్సీ విద్యార్థి కప్పల తిరుమలేశ్ ఆక్సిజన్ విత్ వెంటిలేటర్ మాస్క్ రూపొందించాడు. మాస్క్ తయారీకి కేవలం రూ.500 మాత్రమే ఖర్చవుతుంది. ఈ మాస్క్ ధరించడం వల్ల పీల్చి వదిలేసిన గాలి రీసైక్లింగ్ అవుతుంది. తద్వారా ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన గాలి అందుతుంది. శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. దీనిని జేబులో కూడా అమర్చుకోవచ్చు.
హైట్ అడ్జస్టబుల్ స్టవ్
దేవరకొండరూరల్ : హైట్ అడ్జస్టబుల్ స్టవ్‌తో అనుకూలమైన ఎత్తుకు మార్చుకుని వంట చేసుకోవచ్చు. ఇది, వృద్ధులకు, దివ్యాంగులకు ఉపయోగపడుతుంది. దీని తయారీకి రూ.5వేలు ఖర్చయ్యింది. స్టవ్, హైట్ అడ్జస్టబుల్ టేబుల్, గ్యాస్ ప్రెజర్ కంట్రోలర్‌ను ఉపయోగించారు. సైన్స్ టీచర్ బాబమ్మ సహకారంతో రూపొందించినట్లు పడ్మట్‌పల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని పంబాల గిరిజ తెలిపింది.
కిచెన్ వేస్టేజీ నుంచి గ్యాస్..
హాలియా : అనుముల మండలం చల్మారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వికాస్, పల్లవి రెండు ప్రాజెక్టులను రూపొందించారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి వికాస్ బ్లైండ్ మెన్ స్టిక్ తయారు చేశారు. అంధులు నడుకుంటూ వెళ్తున్నప్పుడు ఎదురుగా గోడ, ఏవైనా అడ్డుగా ఉంటే వెంటనే గుర్తించి అప్రమత్తం చేసే విధంగా స్టిక్‌ను రూపొందించాడు. 9వ తరగతి విద్యార్థిని పల్లవి కిచెన్ వేస్టేజీ నుంచి గ్యాస్ తయారీ
ప్రాజెక్టును ఆవిష్కరించింది.
జాతీయస్థాయికి తీసుకువెళ్లాలి..
ఇన్స్పైర్ మానక్ అవార్డుల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ అద్వితీయం. మంచి ప్రదర్శనలతో రాష్ట్రస్థాయికి ఎంపికవడం జిల్లాకు గర్వకారణం. జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఎంపికైన పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు. ఇదే స్ఫూర్తితో అన్ని పాఠశాలలు విద్యార్థులను ప్రోత్సహించాలి. జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతికి ప్రత్యేక అభినందనలు.
హైట్ అడ్జస్టబుల్ సీలింగ్ ఫ్యాన్..
గుర్రంపోడు: ఆదర్శ పాఠశాల విద్యార్థిని మానస సైన్స్ ఉపాధ్యాయుడు సీతారామరాజు పర్యవేక్షణలో అడ్జస్టబుట్ సీలింగ్ ఫ్యాన్‌ను రూపొందించింది. చిన్న బటన్‌తో ఫ్యాన్‌ను కిందికి, పైకి జరుపుకొనే అవకాశం ఉంటుంది. అదే సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోతుంది. దాంతో ఫ్యాన్‌ను శుభ్రం చేసుకుని ఏదైనా ఒక పొడవాటి కర్రతో పైకి నెట్టితే ఫ్యాన్ యథాస్థితికి చేరుతుంది.
పండ్లు కోసే పరికరం..
నిడమనూరు : రాజన్నగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కాట్నం మణికంఠ ఫ్రూట్ పికర్ ప్రాజెక్టును రూపొందించాడు. ఎత్తైన చెట్ల నుంచి పండ్లు, కాయలు సులభ పద్ధతుల్లో తెంపేలా ప్లాస్టిక్ బాటిల్, దారం, పొడవైన చేతి కర్రతో పరికరాన్ని తయారు చేశాడు. ప్లాస్టిక్ బాటిల్‌కు బిగించిన దారాల సాయంతో పండ్లు, కాయలు జారకుండా సులభంగా కోసే పరికరమే ఫ్రూట్ పికర్.
ధాన్యం ఎత్తే యంత్రం
కనగల్ : దోరెపల్లి ఉన్నత పాఠశాల 7వ తరగతి విద్యార్థి బి.విరాట్ కోహ్లీ రైతులకు ఉపయోగపడే యంత్రాన్ని రూపొందించాడు. ఐకేపీ కేంద్రాల్లో రైతులు ధాన్యం ఆరబెట్టేందుకు అవస్థలు పడుతున్న నేపథ్యంలో సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో ధాన్యాన్ని అరబోసి, కుప్ప చేసే(సింపుల్ టూల్ ఫర్ హిప్ ఫుడ్ గ్రెయిన్స్) పరికరాన్ని తయారు చేశాడు.