కోదాడ టౌన్, నవంబరు 2 : ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టడంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కోదాడ జాతీయ రహదారి కట్టకొమ్మగూడెం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే హైదరాబాద్ నుంచి (రాజమండ్రి) గోకవరానికి ప్రయాణికులతో వెళ్తున్న మహి ట్రావెల్స్ బస్సు కోదాడ సమీపంలోకి రాగానే ప్రయాణికులు వాష్రూంకి వెళ్తానంటే రోడ్డు పక్కన నిలిపాడు.
ఈ క్రమంలోనే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ట్రావెల్స్ బస్సును బలంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లోనే ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన 25 మందిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఆరుగురిని కోదాడలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.
ఆగి ఉన్న బస్సు ఒక్కసారిగా రోడ్డు మీదికి రావడంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నది. గాయపడిన వారిలో వెంకటేశ్వరరావు, కె.మణి, దానియేలు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నవ్య, ఆదిత్య, తేజ, డేవిడ్ కోదాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.