ఆలేరు టౌన్ , ఆగస్టు 19: పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆలేరులోని ముసురుతో సిల్క్ నగర్, మార్కండేయ కాలనీ, కాంత్రి నగర్, భారత్ నగర్ కాలనీలతోపాటు మండలంలోని కొలనుపాక, టంగుటూరు, శారాజీపేట గ్రామాల్లో చేనేత కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కురుస్తున్న వర్షాలకు ఆర్థికంగా కుదేలవుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని చేనేత కళాకారుల కుటుంబాలు ఆలేరు మండలంలో సుమారు 350 వరకు ఉన్నాయి.
వృత్తిలో భాగంగా ఒక వార్పుకు 8 పోచంపల్లి పట్టు చీరలు తయారు అవుతాయి. భార్యాభర్తలు ఇరువురు కష్టపడితే నెలకు 8 చీరలను చేనేత కళాకారుడు నేస్తాడు. 8 చీరలు నేస్తే వారికి 15వేలు కూలి లభిస్తుంది. నిరంతరం ముసురు కురుస్తుంటే మగ్గం నడవక నేతన్నలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నెలలో 20 రోజులు నేస్తే రూ.9 వేలు కూలీ లభిస్తుంది. ఈ క్రమంలో పిల్లల స్కూల్ ఫీజులు ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర పరిస్థితిలో వైద్య ఖర్చులకు, ఇతర కుటుంబ అవసరాలకు చేతిలో చిల్లిగవ్వలేక అవస్థలు పడుతున్నామని వారు వాపోతున్నారు. ఇటీవల బెంగళూరులో కురిసిన వర్షాలతో మల్బరీ పంట నష్టపోయింది. దీంతో పట్టుదారం ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో పట్టుదారం ధరను అక్కడి వ్యాపారులు పెంచారు. పెరిగిన ధరలకు అనుగుణంగా సొంతగా చీరలు తయారు చేసే విక్రయదారులకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితి నెలకొన్నది.
పెట్టుబడి పెరిగినా ఆ మేరకు ఆదాయం సమకూరకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ కారణాల వల్ల కొన్ని నెలలుగా పోచంపల్లి పట్టుచీరల విక్రయాలు పడిపోవడంతో చేనేత కళాకారులకు పని దొరకక పస్తులుండే పరిస్థితి వచ్చింది. ఏపీ ప్రభుత్వం మాదిరిగానే తమకూ 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వానికి చేనేత కళాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏపీలో మాదిరిగా ఉచితంగా కరెంటు ఇవ్వాలి
ఏపీ ప్రభుత్వం మాదిరిగానే మన ప్రభుత్వం కూడా చేనేత రంగానికి ఉచిత కరెంట్ ఇవ్వాలి. ఆర్థ్ధికంగా వెనుకబడిన చేనేత కళాకారులకు సబ్సిడీపై రుణాలు మంజూరుచే యాలి. ఇంతకుముందు ఇచ్చిన రుణాలను మాఫీ చేశామని చెబు తున్నారు. కానీ బ్యాంకు అధికారులు రుణాలు కట్టాలని కార్మికులపై ఒత్తిడి తెస్తూ, నోటీసులు పంపడం సరికాదు. చేనేత కార్మికుడు చనిపోతే గతంలో రూ.5 లక్షల ఇన్సూరెన్సు 10 రోజుల్లో కార్మికుడి ఖాతాలో డబ్బులు జమ అయ్యేవి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆ డబ్బులు ఎప్పుడు వస్తున్నాయో ఎవరికీ తెలియడం లేదు.
– గట్టురాజు, చేనేత కార్మిక సంఘం ఆలేరు పట్టణ అధ్యక్షుడు
రుణమాఫీ కాలేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం అ ధికారంలోకి వస్తే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు, నిర్వహించి ఆప్కో ద్వారా వస్ర్తాలను కొనుగోలు చేస్తామని మాట ఇచ్చి తుంగలో తొక్కింది. చేనేత దినోత్సవం రోజున హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.33 కోట్లు విడుదల చేసినా నేటికి ఏఒక్క కళాకారునికి రుణమాపీ కాలే దు. ప్రభుత్వ వెంటనే రుణమాఫీ చేసి చేనేత కళాకారులను ఆదుకోవాలి.
– పాశికంటి శ్రీనివాస్, ఆలేరు పద్మశాలీ సంఘం అధ్యక్షుడు