ఆకట్టుకునే ప్రకృతి రమణీయత.. ఆహ్లాదం పంచే సాగర్ వెనుక జలాల అందాలు.. పక్షుల కిలకిలు.. కనువిందు చేసే దృశ్యాలతో తెలంగాణ అరకుగా పేరొందిన ప్రాంతం దేవరకొండ నియోజకవర్గంలోని నేరెడుగొమ్ము మండల పరిధిలోని సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతం. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో తెల్లగుట్ట కేంద్రంగా ఎకో టూరిజం ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన.. ఎకో టూరిజం సాధ్యసాధ్యాలను పరిశీలించి టెండర్లను సైతం ఆహ్వానించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో ఇక్కడ ఎకో టూరిజం ఊసే లేకుండా పోయింది. మొత్తం ప్రాజెక్టుపైనే నీలినీడలు అలుముకున్నాయి.
నేరెడుగొమ్ము మండలంలోని వైజాక్ కాలనీపాటు సమీపంలోని ఏలేశ్వరం, కాచరాజుపల్లి వద్ద ఉన్న గాజుబేడం గుహలు, చందంపేట మండలంలోని దేవరచర్లలో రేచర్ల పద్మనాయకులు నిర్మించిన శివాలయాన్ని కలుపుతూ ఎకో టూరిజానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజం పడింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అప్పటి పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్రెడ్డి నేతృత్యంలో పలుమార్లు క్షేత్ర పరిశీలన కూడా చేపట్టారు. వైజాక్ కాలనీ సమీపంలో సాగర్ వెనుక జలాల సమీపంలోని తెల్లగుట్ట వద్ద సర్వే నెం.201లో 12 ఎకరాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5కోట్లను సైతం మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎకో టూరిజం గురించి కనీసం పట్టించుకోవడం లేదు.
మా దగ్గర ఎకో టూరిజం అభివృద్ధి అవుతుందని చెప్తే ఎంతో సంబుర పడ్డాం. ఇప్పుడు పట్టించుకునే వారే లేరు. ప్రభుత్వం స్పందించి ఏర్పాటుచేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పెరుగతాయి. పర్యాటకంగా మంచి ఆదరణ వస్తుంది.
ఎకో టూరిజం ఏర్పాటు అయితే ఇక్కడ నుంచి ఉపాధి కోసం వలసలు వెళ్లే పరిస్థితి ఉండదు. సాగర్ వెనుక జలాలు, ఇక్కడి ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఎకో టూరిజం చేస్తే మరింత ఆదరణ లభిస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మికతోపాటు ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
ఎకో టూరిజం అభివృది అయితే వైజాక్ కాలనీతోపాటు బుగ్గతండా, తూర్పుతండా, చిన్నమునిగల్, పెద్ద మునిగల్, కాచరాజుపల్లి, సుద్దబాయితండా, బిల్డింగ్తండా, చందంపేట మండలంలోని మంగలితండా, నక్కదుబ్బతండా, కంబాలపల్లి, దేవరచర్ల, యల్మలమంద గ్రామాల్లో అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి పెరిగి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఇటీవల కాచరాజుపల్లి సమీపంలో సాగర్ వెనుక జలాల్లో బర్మాస్వామి దేవాలయం నిర్మించగా, పెద్దమునిగల్ తుల్జా భవానీ జాతరలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. వైజాక్ కాలనీ సమీపంలో సాగర్ వెనుక జలాలు అందాలను వీక్షించేందుకు వారాంతాల్లో పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. వారిలో హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్లే ఎక్కువ. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎకో టూరిజంపై చొరవ చూపాలని ఈ ప్రాంత ప్రజలు, పర్యాటకులు కోరుతున్నారు.