భూదాన్ పోచంపల్లి, మే 31 : పచ్చని పల్లెల్లో వాయు కాలుష్యం దినదినం ప్రాణాంతకంగా మారుతోంది .కాలుష్య కారక కంపెనీల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు జనం పాలిట యమ పాశాలుగా మారుతున్నాయి. పచ్చని పల్లెల్ని వాయు కాలుష్యం కాటేస్తుంది. కాలుష్యం కొరల్లో చికి భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మ గూడెం పరిసర గ్రామాల ప్రజలు కాలుష్యానికి బలి అవుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో శత్రువులను హతమార్చేందుకు ఉపయోగించిన విషపూరిత రసాయనం పాస్జీన్ వాయువును గాలిలోకి విడుదల చేయడంతో గ్రామీణ ప్రజలు వింత రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి పర్యావరణానికి హాని కలిగిస్తున్న రసాయన కంపెనీలపై చర్యలు చేపట్టకుండా పీసీబీ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని జనం ఆరోపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మ గూడెం, ధోతి గూడెం, జిబ్లక్ పల్లి గ్రామాల పరిధిలో 9 రసాయన కంపెనీలు ఉన్నాయి. హెజోలో రసాయన కంపెనీ నుంచి విడుదల చేస్తున్న వ్యర్థ రసాయనాలు భూగర్భ జలాల్లోకి చేరడంతో సుమారు 1200 ఎకరాల విస్తీర్ణంలో భూమిలోని నీరు పూర్తిగా విషపూరితమైంది.
ఇప్పటికిప్పుడు ఇక్కడి కంపెనీలను మూసివేసినా నేల తిరిగి సాధారణ స్థితికి చేరేందుకు 110 సంవత్సరాలు పడుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. కాలుష్య కారక కంపెనీల నుంచి వెలువడే పాస్జీన్, బెంజిన్, ఇథైల్ బెంజిన్, టోలిన్, ఎసిటోన్, డైక్లోరో మిథైన్, డైమిథైల్ ఫార్మా మైడ్, నాఫ్తాలిన్ తదితర వ్యర్థ రసాయనాలతో ఊపిరితిత్తులు, గుండె, క్యాన్సర్, జన్యు లోపాలు, చర్మవ్యాధులు, నపుంసకత్వం,దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలుతున్నాయి. కంపెనీల నుంచి వెలువడే భూగర్భ జలాలు కలుషితం కావడంతో నీళ్ల రంగు మారడంతో పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాగేందుకు మంచినీరు లేక, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి లభించక, ఉపాధి కరువై వలస వెళ్లే దుస్థితి నెలకొంది.
హెజోలో కంపెనీ నుంచి వెలువడే పాస్జీన్ కాలుష్యంతో 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంతమ్మ గూడెం, దోతిగూడం, పరిసర గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. రసాయన కంపెనీలపై చర్యలు చేపట్టాలని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని స్థానికులు వాపోతున్నారు. కంపెనీల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 52 వేల పరిహారం, గ్రామంలో దవాఖాన, కాలుష్యాన్ని నిర్ధారించే యంత్రం ఏర్పాటు చేసి, రసాయన కంపెనీలను తరలించాలని గ్రామస్తులు తీర్మానించారు. పీసీబీ అధికారులు కాలుష్యం వెదజల్లుతున్న కంపెనీలపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కాలుష్యం నుంచి విముక్తి చేయాలి
స్థానిక హెజోలో కంపెనీ నుంచి వెలువడుతున్న విషవాయువు పరిసర గ్రామ ప్రజలను ఉకిరి బికిరి చేస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీ పకనే ఉన్న 15 ఎకరాల్లో చెట్లు పెంచినా బతకడంలేదు. పొలంలో సాగు పనులు చేస్తూ మా అమ్మ క్యాన్సర్ బారిన పడింది. భూమిలోని 8 ఫీట్ల మేర కాలుష్యం ఆవరించి ఉండటంతో పంటలు పండక భూమి పడావు పడ్డది. కాలుష్య కంపెనీలపై పలు సార్లు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేరు.
-గుమ్మి నరేందర్‌రెడ్డి, కాలుష్య విముక్తి పోరాట సమితి నాయకుడు, అంతమ్మ గూడెం
32 సార్లు పిటిషన్ ఇచ్చా..
కంపెనీలపై చర్యలు చేపట్టాలని అధికారులకు ఇప్పటికీ 32 సార్లు పిటిషన్ ఇచ్చా. పరిశ్రమల నుంచి నిరంతరం వెలువడే వాయు కాలుష్యంతో శ్వాసకోస వ్యాధులు, క్యాన్సర్ తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పీల్చే గాలివల్ల మనుషులతో పాటు పశుపక్ష్యాదులు విలవిల్లాడుతున్నాయి.
-గుమ్మి దామోదర్‌రెడ్డి, రైతు, అంతమ్మగూడెం, భూదాన్ పోచంపల్లి మండలం
కాలుష్య కంపెనీలను మూసివేయాలి
కాలుష్య కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. హేజోలు కంపెనీ అత్యంత విషపూరితమైన పాస్ జీన్ వాయువును గాలిలోకి విడుదల చేయడం ఆందోళనకరం. ప్రాథమిక హకులను హరించే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బాధితులకు పరిహారంతో పాటు పునరావాసం కల్పించాలి.
-ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణవేత్త