నల్లగొండ ప్రతినిధి, మార్చి 24(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉండి రుణమాఫీకి నోచుకోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ) రైతుల దుస్థితి ఇది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యానికి తోడు ప్రభుత్వ నిర్లిప్తత వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15వేల మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2024 డిసెంబర్ నుంచి దాదాపు 15నెలలుగా రుణమాఫీ కోసం కనపడ్డ వారి కాళ్లవేళ్లా పడుతున్నా పట్టించుకోనే నాథుడే కరువయ్యారు. రుణమాఫీ కోసం బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని బాధిత రైతులు కోరారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 7041 మంది..
ప్రభుత్వం, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన సాంకేతిక పొరపాటుతో రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 7041 మంది రైతులు రూ.రెండు లక్షలలోపు రుణమాఫీకి నోచుకోలేదు. ఖమ్మం, వరంగల్ జిల్లాలు కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15వేల మంది ఉంటారని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం 2024 ఆగస్టు నుంచి విడతల వారీగా రుణమాఫీని ప్రకటించింది. చివరి విడతగా రూ.రెండు లక్షల లోపు రుణమాఫీ అంటూ 2024 డిసెంబర్ 9న లబ్ధిదారుల జాబితా విడుదల చేసింది.
అయితే పారదర్శకత కొరవడడంతో రాష్ట్ర వ్యాప్తంగానే నేటికీ లక్షలాది మంది ఈ పథకానికి నోచుకోలేదన్నది బహిరంగ రహస్యమే. కొర్రీల మీద కొర్రీలతో సాధ్యమైనంత వరకు లబ్ధిదారుల సంఖ్యను కదిస్తూ ఆర్థిక భారం తప్పించుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమించిన సంగతి తెలిసిందే. ఇలాంటి వాటిని పక్కన పెట్టిన ప్రభుత్వం ప్రకటించిన జాబితాలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు చెందిన రైతులు సైతం నేటికీ రుణమాఫీకి దూరంగానే ఉన్నారు. లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉండడంతో సంతోషించిన గ్రామీణ బ్యాంకు రైతులు తీరా బ్యాంకుకు వెళ్లాక బిక్కముఖం వేయాల్సి వచ్చింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే సూరారం గ్రామానికి చెందిన 165 మంది రైతులకు రుణమాఫీ అందుకోలేకపోయారు. ప్రభుత్వ అధికారులు ఇది బ్యాంక్ సమస్యగా చెబుతుండగా బ్యాంకు అధికారులు మాత్రం ప్రభుత్వమే మళ్లీ కొత్తగా పంపించాలంటూ తప్పించుకుంటున్నారు.
ఐఎఫ్ఎస్సీ కోడ్ మార్పుతో..
2023 డిసెంబర్ నాటికి తీసుకున్న రైతులకు రూ.రెండు లక్షలలోపు రుణమాఫీ వర్తింపజేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు(ఏపీజీవీబీ)లోనూ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన వేలాది మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం రూ.లక్షలోపు రుణమాఫీ ప్రకటించిన సమయంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ తీరా రూ.రెండు లక్షలలోపు రుణమాఫీ సమయంలో బ్యాంకు చేసిన పొరపాటు వల్ల సాంకేతిక సమస్య తలెత్తింది.
2024 నవంబర్ వరకు ఏపీజీవీబీగా కొనసాగిన బ్యాంకును తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చారు. దీంతో పాటు ఐఎఫ్ఎస్సీ(IFSC) కోడ్లను కూడా మార్చేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్రాంచ్‌లకు కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్లు వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన రైతుల రుణాల వివరాలను ఏపీజీవీబీ బ్యాంకు పేరుతో, దాని ఐఎఫ్ఎస్సీ కోడ్లతోనే బ్యాంకులకు విడుదల చేసింది. అప్పటికే కొత్త కోడ్స్ రావడం వల్ల పాత కోడ్స్తోనే నిధులను పంపించడంతో ఇబ్బంది తలెత్తింది. అలా ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ నిధులు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్(డీబీటీ) కింద రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దీంతో గ్రామీణ బ్యాంకులోని సుమారు 15వేల మంది రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ లబ్ధికి నోచుకోలేదు.
పట్టించుకునే నాథుడే కరువు..
సాంకేతిక సమస్యతో రుణమాఫీకి దూరంగా ఉన్న రైతులంతా 15 నెలలుగా చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కనికరించే వారు లేరు. ప్రభుత్వ పెద్దల చుట్టూ, బ్యాంకు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు. సూరారం రైతులు స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పలుమార్లు కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలను సైతం కలిసి విన్నవించారు. అయినా ఎవ్వరూ దీనిపై స్పందించిన పాపనపోలేదు. దీంతో రైతులు ఇటీవలే బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి గ్రామీణ బ్యాంకు రైతులు దుస్థితిని వివరించారు. సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరినట్లు రైతులు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ తమ వద్ద నుంచి పూర్తి వివరాలు సేకరించారని చెప్పారు.
బ్యాంకు అధికారుల వేధింపులు..
ప్రభుత్వ నిర్లక్ష్యంతో రుణమాఫీకి నోచుకోని లబ్ధిదారులను బ్యాంకు అధికారులు రుణాల చెల్లింపుల కోసం వేధిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్లతో తిరిగిన రుణమాఫీ నిధులు విడుదల చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ అలా జరగనిపక్షంలో రుణా లు, దానిపై వడ్డీని చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. పాత రుణాలపై వడ్డీలు పెరిగిపోవడమే కాకుండా కొత్తగా రుణాలను బ్యాంకు అధికారులు ఇవ్వడం లేదని సూరారం గ్రామానికి చెందిన రైతు ఏడుదొడ్ల మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పదించి వేలాది మంది రైతులు ఇబ్బందులను తొలగించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసేలా రైతుల పక్షాన జిల్లా ప్రజాప్రతినిధులు నిలదీయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ల క్ష్యంతో జాబితాలో పేరుండి కూడా అర్హులైన వేలాది మం ది రైతులు రుణమాఫీకి నోచుకోలేదని వాపోయారు.