యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన ప్రజలకు నచ్చలేదా..? అతి తకువ కాలంలో సరారుపై జనంలో వ్యతిరేకత వచ్చిందా..? స్థానిక ఎమ్మెల్యేలను మెచ్చడం లేదా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఓ ప్రైవేట్ లైవ్ సర్వే ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీఆర్ఎస్ పాలనే బాగుందని కుండబద్ధలు కొట్టారు. ఆలేరు, భువనగిరి రెండు నియోజకవర్గాల్లోనూ మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి బాగా పని చేశారంటూ కితాబిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన, పనితీరుపై ఆ పార్టీ ఆన్లైన్ సర్వే నిర్వహించి అభాసుపాలు అయిన విషయం తెలిసిందే. ఆ సర్వేలో ప్రజలు బీఆర్ఎస్కు అనుకూలంగా తీర్పించారు. సరిగ్గా అదే విధంగా యాదాద్రి జిల్లాలోనూ ఆన్లైన్ లైవ్ సర్వే సోషల్ మీడియాలో చకర్లు కొడుతున్నది. స్ట్రాపోల్ డాట్ కమ్ అనే వెబ్ సైట్ లింక్ వాట్సాప్ గ్రూప్‌లలో విపరీతంగా షేర్ అవుతున్నది. ఇందులో ఆసక్తికర తీర్పు వెళ్లడైంది.
భువనగిరిలో పైళ్లకే పట్టం..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు పర్యాయాలు భువనగిరి ఎమ్మెల్యేగా పైళ్ల శేఖర్ రెడ్డి పనిచేశారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగా.. అనిల్ కుమార్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే లైవ్ పోల్ సర్వే కుంభం అనిల్‌కు చుకెదురైంది. శేఖర్ రెడ్డికి జనం ఓటేశారు. ఆదివారం రాత్రి 7గంటల వరకు వచ్చిన డేటా ప్రకారం 2,459 ఓట్లతో 61.51శాతం మంది ఓటేశారు. కుంభంకు కేవలం 1,539 ఓట్లతో 38.49శాతం మాత్రమే పోలయ్యాయి. మొత్తం 3,998 మంది పోల్‌లో పాల్గొన్నారు.
ఆలేరులో సునీతమ్మకు..
జిల్లాలోని మరో నియోజకవర్గమైన ఆలేరులో సైతం బీఆర్ఎస్కే మొగ్గు చూపారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి పాలనకే ఫిదా అయ్యారు. సర్వేలో బీఆర్ఎస్కు 829 ఓట్లతో 48.39 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 746 ఓట్లతో 43.55శాతం మంది ఓట్లేశారు. 8.06 శాతం మంది రెండూ బాగాలేవని స్పష్టం చేశారు. సర్వేలో 1,713 మంది పాల్గొన్నారు.
కాంగ్రెస్ టీమ్ ఆపసోపాలు..
ఆన్లైన్ సర్వేలో కాంగ్రెస్‌కు పరాభవం ఎదురుకావడంతో ఆ పార్టీ సోషల్ మీడియా టీమ్‌లు రంగంలోకి దిగాయి. సర్వేలో ఓట్ల శాతం పెంచుకునేందుకు ఆపసోపాలు పడ్డాయి. కాంగ్రెస్ గ్రూపులో సర్వే లింక్‌ను షేర్ చేశాయి. అయినప్పటికీ కాంగ్రెస్‌కు పాజిటివ్ స్పందన రాలేదు. బీఆర్ఎస్కు స్వచ్ఛందంగా మద్దతు లభించింది. దీంతో చేసేదేం లేక సోషల్ టీములు తలలు పట్టుకున్నాయి. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో.. కాంగ్రెస్ మద్దతుదారులకు పరాభావం ఎదురయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ వైఫల్యాలే కారణమా..?
ఆన్లైన్ సర్వేలో కాంగ్రెస్‌కు తకువ ఓట్ల శాతం రావడంపై రాజకీయ విశ్లేషకులు పలు విధాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి రైతుల వ్యతిరేకత మూట కట్టుకుంటున్నదని అంటున్నారు. రైతుబంధు సాయం పెంచలేదని, మధ్యలో ఒక సీజన్‌కు ఎగవేసిందని, ఇప్పుడు కూడా ఇంకా డబ్బులు జమ చేయలేదని పేరొంటున్నారు. రుణమాఫీ కొందరికే అమలు చేశారని వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలులో విఫలమైందని అంటున్నారు.విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు అన్ని వర్గాల వారిని మభ్య పెట్టి అధికారంకి వచ్చిందని, ఏ ఒక పథకం సరిగ్గా అమలు చేయడం లేదని ఎత్తిచూపుతున్నారు. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పథకాలు చేయడంపై జనం గుస్సగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల పని తీరుపైనా జనం ఆగ్రహంగా ఉన్నారని, ఏడాది పాలనలో చెప్పుకోదగిన పనులు ఏమీ లేవని పేర్కొన్నారు. నిధులను తీసుకురావడంలో సక్సెస్ కాలేదనే అపవాదు ఉందని, ప్రజలు, కేడర్‌ను దూరం పెట్టారని తెలియజేస్తున్నారు.