నల్లగొండ సిటీ, సెప్టెంబర్ 06 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం కనగల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు రిజిస్టర్‌తో పాటు ఆస్పత్రికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వస్తున్న రోగుల వివరాలు, వారు ఎలాంటి రుగ్మంతలతో వస్తున్నారు, వారికి సరిపడా మందులు ఉన్నానా లేవా అని ఆరా తీశారు.
రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, ఎప్పటికప్పుడు ఇండెంట్ పెంచుకోవాలని సిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున రోగులకు అవసరమైన పరీక్షలు చేసేందుకు వీలుగా కిట్లు తెప్పించుకోవాలన్నారు. అందుబాటులో లేని పరీక్షల కోసం టీ డయాగ్నస్టిక్స్ సెంట్రల్ కు శాంపిల్స్ పంపించాలన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని, వారికి గౌరవంగా చికిత్స అందించాలని పేర్కొన్నారు. ఆమె వెంట తాసీల్దార్ పద్మ, ఎంపీడీఓ సుమలత, డాక్టర్లు రామకృష్ణ, రమణారెడ్డి ఉన్నారు.