– అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
రామగిరి, డిసెంబర్ 25 : ప్రధాని మోదీ ప్రభుత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి, 2025 పేరుతో 197 బిల్లును తెచ్చారని, ఈ బిల్లు చట్టమైతే ఉపాధి హామీ చట్టం తల లేని మొండెంగా తయారు అవుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. గురువారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ 2047లో భాగం చేస్తూ గ్యారంటీ రోజ్గార్ అలాగే అజీవిక మిషన్ (గ్రామీణ) Vb – G RAM G 2025 బిల్లు తెచ్చినట్లు తెలిపారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎందుకు రద్దు చేయబోతున్నారని? ఈ చట్టం ఉపయోగం లేదు అనుకుంటున్నారా, కొత్త చట్టం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే చర్యలు ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఉపాధి హామీ నిధులతో ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం ఇస్తున్న భూముల అభివృద్ధి, కాలనీల అభివృద్ధి, డబుల్ బెడ్రూం ఇళ్లు, నివాస ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఉపాధి నిధులు మంజూరు చేస్తూ పనులు చేపట్టడం జరిగిందని, ఇప్పుడు వాటి ప్రస్తావనే లేకుండా పోయిందని ఇలాంటి అనేక అంశాలు ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకంగా అనేకం ఉన్నాయని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఈ కొత్త బిల్లు ఉపాధిని హరించేదిగా, కొద్ది మేరకు ఉన్న ఉపాధి అవకాశాలు కూడా లేకుండా పోతాయని, అందుకే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టమే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నారీ ఐలయ్య, భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, సిఐటియు జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్, సిఐటియు మండల కన్వీనర్ పోలె సత్యనారాయణ పాల్గొన్నారు.