కులం, మతం, డబ్బు, పైరవీలు, అక్రమాలకు ఆస్కారం లేకుండా సర్కారు కొలువులకు అంతిమ గీటురాయి ప్రతిభ అనేది మరోసారి నిరూపితమైది. తాజాగా వెలువడిన ఎస్ఐ ఫలితాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులు తుది ఫలితాల్లో ఎస్ఐలుగా ఎంపికయ్యారు. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో యాదాద్రి జోన్లో సింహభాగం సాధారణ కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. సమైక్య పాలనలో పైరవీకారులు, డబ్బున్నోళ్లకే ఎక్కువగా పోలీసు ఉద్యోగాలు దక్కేవని నానుడి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్ఐ) పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర స్థాయిలో 543 పోస్టులకు నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫిజికల్ టెస్టులు, రాత పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి ఇలా అన్ని దశల్లోనూ పూర్తి పారదర్శకతతో వ్యవహరించారు. దాంతో యాదాద్రి జోన్ పరిధిలో 65 పోస్టుల కోసం ఎంపికైన వారిలో అత్యధికులు సాధారణ కుటుంబాలకు చెందిన యువకులే ఉన్నారు. ఒక్కపైసాఖర్చు లేకుండా, ఎవరి జోక్యం లేకుండా సాధించిన ఉద్యోగాలతో ఆయా కుటుంబాల్లో సంతోషం వెల్లువిరుస్తున్నది. టీఎస్పీఎస్సీలో కొందరి స్వార్థంతో జరిగిన వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసు ఉద్యోగాల భర్తీపైనా అనేక అనుమానాలు రేకెత్తించేలా ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఎస్ఐ ఫలితాలు
చెంపపెట్టులా నిలిచాయనడంలో సందేహం లేదు.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనగానే గతంలో అనేక అవకతకలకు ఆస్కారం ఉండేది. ప్రతిభ కలిగిన వారికి కొన్నిసార్లు తీరని అన్యాయం జరిగేది. దాంతో కొన్ని ఉద్యోగాల వైపు సాధారణ కుటుంబాల వారు దృష్టి కూడా పెట్టేవారు కాదు. కానీ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాగిన ఉద్యమంతో తెలంగాణను సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రంలో నియామకాలను సైతం అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తూ అందరికీ సమన్యాయం జరిగేలా కొత్త జోనల్ వ్యవస్థ తీసుకొచ్చారు.
దాని ప్రకారం వేలాది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఓ వైపు టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్స్‌తోపాటు ఇతర పరీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. అయితే ఉద్యోగాల భర్తీలో అక్రమాలు, పైరవీలకు తావు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంది. గతంలో ఎస్ఐలు, తాసీల్దార్ల వంటి అధికారుల స్థాయి పోస్టుల భర్తీ ఆరోపణలకు నిలయంగా ఉండేవి. రాత పరీక్షల్లోనే పైలెటింగ్, ఇతర అక్రమాలు, ఇంటర్వ్యూల సమయంలో డబ్బులకు పెద్దపీట లాంటివి కనిపిస్తుండేవి. పేద అభ్యర్థుల్లో హైలీ టాలెంటెడ్ వాళ్లల్లో కొందరికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత అమ్మకానికి పెట్టే పరిస్థితులు కోకొల్లలుగా ఉండేవి. కానీ, స్వరాష్ట్రంలో వాటికి చెక్ పెడుతూ ఉద్యోగాల భర్తీ కొనసాగుతున్నది. ఇప్పటికే అనేక ఉద్యోగాలు అవకతవకలు లేకుండా భర్తీ చేశారు.
ఆదివారం సాయంత్రం విడుదలైన ఎస్ఐ పోస్టులు సైతం ప్రతిభ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. వెల్లడైన ఫలితాను పరిశీలిస్తే అత్యంత సామాన్య కుటుంబాలకు చెందిన యువకులు ఎంతో మంది ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికయ్యారు. యాదాద్రి జోన్లో మొత్తం 65 పోస్టులు ఉంటే అందులో మెజార్టీ వారు సామాన్య యువకులే. వీరంతా పరీక్షల నిర్వహణపైనా, ప్రభుత్వ చిత్తశుద్ధిపైనా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సర్కార్ చిత్తశుద్ధితోనే ఇది సాధ్యమైందని ప్రశంసిస్తున్నారు. ఎక్కడా చిన్న అనుమానాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించారని, పరీక్షల ఫలితాల వెల్లడిలోనూ కటాఫ్ మార్కుల నిర్ధారణలోనూ అంతా పారదర్శకంగా జరిపారని చెబుతున్నారు. కేవలం తమ ప్రతిభ ఆధారంగా తమ చిన్ననాటి కల నెరవేరుతుండడం తమతోపాటు కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. ఈ ఉద్యోగాలు తమ జీవితాల్లో మార్పునకు తొలిమెట్టు అని సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
చదువునే నమ్ముకొని ఉద్యోగం సాధించా
మాది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. మా నాన్న సుతారి మేస్త్రిగా పని చేస్తాడు. మా అమ్మ కూలి పనులకు వెళ్తుంది. మా అమ్మ నాన్న నన్ను, మా తమ్ముడిని కష్టపడి చదివించారు. నేను 7వ తరగతి వరకు యూపీఎస్ మొల్కపట్నంలో చదివాను. పదో తరగతి వరకు జడ్పీహెచ్ఎస్ రావులపెంటలో, బీటెక్ బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేశాను. నేను బీటెక్ చేసేందుకు మా నాన్న చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మా కుటుంబం పడే బాధలు చూడలేక ఎస్ఐ జాబ్ కొట్టాలకున్నా. ఆ దిశగా ప్రిపేర్ అయ్యి నా ఆశయాన్ని నెరవేర్చుకున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగాలకు చాలా నోటిఫికేషన్లు ఇచ్చింది. ఎంతో మంది ఉద్యోగాలు సాధిస్తున్నారు. నేను చదువునే నమ్ముకున్నా. ఎవరికీ పైసా కూడా లంచం ఇవ్వలేదు. పారదర్శకంగా ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగార్థులకు బీఆర్ఎస్ సర్కారులోనే న్యాయం జరుగుతుంది.
పేదరికాన్ని జయించి..ప్రభుత్వ కొలువు సాధించి
శాలిగౌరారం, ఆగస్టు 7 : నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ కృషి, పట్టుదలతోపాటు నాన్న ప్రోత్సాహంతో ప్రభు త్వం వెల్లడించిన ఎస్ఐ ఫలితాల్లో 238 మార్కులు పొంది ఎస్ఐ కొలువు సాధించాడు మండలంలోని ఇటుకలపహాడ్కు చెందిన తాటిపాముల వెంకటేశ్వర్లు, వెంకటమ్మ దంపతుల కుమారుడు తాటిపాముల మధు. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలనే పట్టుదలతోనే తాను ఎస్ఐ కొలువు సాధించాలని గర్వంగా చెబుతున్నాడు. మధు 10వ తరగతి వరకు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం 2019లో వేసిన పోలీస్ కొలువులో పరీక్షకు హాజరైనా ఉద్యోగం రాలేదు. అయినా నిరాశ చెందకుండా ప్రభుత్వ కొలువు సాధించాలనే పట్టుదలతో రెండో ప్రయత్నం చేశాడు. 2023లో ప్రభుత్వం చేపట్టిన పోలీస్ రిక్రూట్మెంట్లో ప్రతిభ కనబర్చి తన లక్ష్యాన్ని సాధించాడు. సివిల్ ఎస్ఐగా ఎంపికై తన తల్లిదండ్రులు, గ్రామానికి పేరు తెచ్చి పెట్టాడు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. కష్టపడి చదివితే ప్రభుత్వ కొలువు సాధించవచ్చని, పైరవీలకు తావు లేకుండా ప్రభుత్వం నియామకాలు చేపట్టిందని చెప్పాడు. తమకున్న రెండెకరాల భూమిని సాగు చేస్తూ తనను చదివించిన మా నాన్నకు, పారదర్శకంగా నియామకాలు చేపట్టిన ప్రభుత్వానికి రుణపడి ఉంటానని తెలిపాడు.
అమ్మ ఆరోగ్యం కోసం..
నాంపల్లి, ఆగస్టు 7 : నాంపల్లి మండలంలోని పెద్దాపురం పంచాయతీ పరిధిలోని బండ్లగూడేనికి చెందిన గోపాల్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మొదటి నోటిఫికేషన్లో ఫైర్‌మన్‌గా సెలెక్ట్ అయ్యి హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. తన తండ్రి 10 సంవత్సరాల క్రితం మృతి చెందడంతో తల్లి కుటుంబ బాధ్యతలు చేపట్టింది. కొడుకు ఉన్నత స్థానంలో ఉండేందుకు పెద్ద చదువులు చదివించేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురైంది. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో పోలీస్ ఉద్యోగంలోనైతే తన తల్లికి ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందుతుందని భావించి పోలీస్ ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు. ఆదివారం వెలువడిన ఎస్ఐ పరీక్ష ఫలితాల్లో సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగంలోనే ఆరోగ్య భద్రత ఉంటుందని, తన తల్లి ఆరోగ్యం కోసం ఎస్ఐగా ప్రయత్నం చేసినట్లు తెలిపాడు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఎస్ఐగా సెలెక్ట్ అయినట్టు చెప్పాడు. పారదర్శకంగా నియామకాలు చేపట్టిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు.
పేదింటి గిరిజన బిడ్డకు ఎస్ఐ ఉద్యోగం
డిండి, ఆగస్టు 7 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్ఐ ఉద్యోగ ఫలితాల్లో మండలంలోని డాక్యతండాకు చెందిన నిరుపేద గిరిజన యువకుడు వడ్త్య గణేశ్ సెలెక్ట్ అయ్యాడు. ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించినట్లు గణేశ్ తెలిపాడు. తమకు ఉన్న మూడు ఎకరాల్లో వ్యవసాయం చేయడంతోపాటు కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే హరిచంద్, నాజులా దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. వారిలో గణేశ్ చివరివాడు. హైస్కూల్ విద్య చెర్కుపల్లి వివేకవర్దిని పాఠశాలలో పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ దేవరకొండలోని సత్యసాయి జూనియర్ కళాశాలలో, సిద్ధిపేటలోని మెదక్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం 2018లో నిర్వహించిన ఎస్ఐ అర్హత పరీక్ష రాయగా ఆ పరీక్షలో ఉత్తీర్ణుత సాధించలేదు. మళ్లీ గత సంవత్సరం నిర్వహించిన సెలక్షన్స్‌లో సొంత ప్రిపరేషన్‌తో ఎస్ఐ ఉద్యోగం సాధించాడు. పైరవీలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా అన్ని స్థాయిల్లో ఎస్ఐ ఎంపిక ప్రక్రియ జరుగడంతో తాను ఉద్యోగం పొందినట్లు గణేశ్ చెప్పాడు.
పేదరికం వెంటాడినా.. పట్టుదల నిలబెట్టింది
కట్టంగూర్, ఆగస్టు 7 : తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించిన ఎస్ఐ ఫలితాల్లో కట్టంగూర్కు చెందిన ఎన్నమల్ల రమేశ్ టీఎస్పీఎస్ ఎస్ఐగా ఎంపికయ్యాడు. 5వ జోన్ యాదాద్రి జోన్లో పరీక్ష రాసి 400 మార్కులకు గానూ 236 పొంది బెటాలియన్ ఎస్ఐగా ఎంపికయ్యాడు. ఎన్నమల్ల యాదయ్య, నాగమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. రమేశ్ రెండో కుమారుడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన రమేశ్ 10వ తరగతి కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్ నల్లగొండలోని ప్రైవేట్ కళాశాల, డిగ్రీ నాగార్జున కళాశాల, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశాడు. తల్లిదండ్రులు గత 10 సంవత్సరాల క్రితం పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐ జాబ్ పొందడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే ఎస్ఐగా ఎంపికయ్యా
మాది మునుగోడు మండలం కొరటికల్ గ్రామం. నేను బీఎస్సీ బీఈడీ చదివాను. నాకు మండల కేంద్రానికి చెందిన చిట్టిప్రోలు రమేశ్‌తో 2013లో వివాహం జరిగింది. చిన్నప్పటి నుంచి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన నాలో బలంగా ఉండేది. నా భర్త ప్రోత్సాహంతో 2018లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించా. ప్రస్తుతం చండూరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నా. ఇంకా ఉన్నత ఉద్యోగం సాధించాలనే కోరికతో తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో ఎస్ఐ నోటిఫికేషన్ ఇవ్వడంతో దరఖాస్తు చేశాను. కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూనే సమయం దొరికనప్పుడు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాను. ఉదయం, సాయంత్ర సమయంలో ఈవెంట్స్ సాధన చేశాను. ఆదివారం విడుదలైన ఫలితాల్లో 242మార్కులు సాధించి ఎస్ఐ(సివిల్)ఉద్యోగానికి ఎంపికయ్యాను. కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూనే ఎస్ఐగా సెలెక్ట్ కావడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే రెండు ఉద్యోగాలు సాధించాను. ప్రతిభ ఉంటే సర్కార్ కొలువు సాధించడం కష్టమేమీ కాదు. ఎలాంటి పైరవీలు చేయనక్కర్లేదు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
-గంజి విజయ, కొరటికల్, మునుగోడు
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సువర్ణావకాశం
రాష్ట్ర ప్రభుత్వం 2022లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంట వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసింది. దాంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న సంకల్పంతో రోజుకు 12 నుంచి 15 గంటలు చదివాను. ఎలాంటి కోచింగ్‌కు వెళ్లకుండా లైబ్రరీలో కూర్చొని చదివాను. నాకు నేనే ప్రశ్నపత్రం తయారు చేసుకొని ప్రాక్టీస్ చేసేవాడిని. ప్రభుత్వం నోఫికేషన్స్ విడుదల చేసిన వెంటనే అప్లయ్ చేసి చదవుపై దృష్టి సారించి పట్టదలతో చదివాను. ఫలితంగా మంచి ర్యాంక్ సాధించా. ఉద్యోగాల ఎంపికలో ప్రభుత్వం పారదర్శకత పాటించింది. ఎలాంటి పైరవీలకు తావు ఇవ్వలేదు. ప్రతిభావంతులకే పట్టం కట్టింది. నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా నియామకాలు చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటా.
-కుసుమ ఉపేందర్‌రెడ్డి, తడకమళ్ల, మిర్యాలగూడ
కష్టపడి చదివా.. ఫలితం దక్కింది
మాది మాడ్గులపల్లి మండలంలోని గడ్డలదోరిగూడెం గ్రామం. నేను మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో పాఠశాల విద్య అభ్యసించాను. ఇంటర్ నల్లగొండలోని ప్రగతి కళాశాల, బీటెక్ టీకేఆర్ హైదరాబాద్‌లో పూర్తి చేశాను. ప్రస్తుతం ఉస్మానియాలో పీజీ చేస్తున్నాను. పీజీ చేస్తూనే ఎస్ఐ ఉద్యోగానికి రోజుకు 6 నుంచి 8 గంటలు కష్టపడి చదివాను. గత ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగేవి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పోటీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. దాంతో నాకు సివిల్ ఎస్ఐ కొలువు వచ్చింది. దళారులను నమ్మి మోసపోవద్దు. సొంతంగా కష్టపడి కొలువు సాధించాలి. తెలంగాణ ప్రభుత్వంలో కష్టానికి ఫలితం దక్కుతుందని నేను నమ్ముతున్నా.
– చాడ సునీత, గడ్డలదోరిగూడెం, మాడ్గులపల్లి
ఎస్ఐ కావాలన్న లక్ష్యంతో కష్టపడ్డా
మాది మునుగోడు మండలం చొల్లేడు గ్రామం. నేను ఎంబీఏ పూర్తి చేశాను. నిరుపేద రైతు కుటుంబంలో పుట్టిన నేను కష్టపడి చదివి 2018లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జోన్లో ఏఆర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. ఉన్నతమైన స్థానంలో ఉండాలనే కోరికతో గతేడాది ఎస్ఐ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేశాను. ఎస్ఐ కావాలన్న లక్ష్యంతో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూనే దొరికిన సమయంలో చదువుతూ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేశాను. ఆదివారం విడుదలైన ఫలితాల్లో 244 మారులు సాధించి సివిల్ ఎస్ఐ ఉద్యోగానికి ఎంపి కయ్యాను. ఎంపికలో అవకతవకలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి పారదర్శకంగా ఎంపిక చే యడం అభినందనీయం. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
-వంగూరి మహేందర్, చొల్లేడు, మునుగోడు రూరల్