బోడుప్పల్, ఫిబ్రవరి10 : నాగార్జునసాగర్ వద్ద కృష్ణానదిలో గురువారం సాయంత్రం స్నానం చేసేందుకు దిగి మృతి చెందిన ముగ్గురు యువకుల అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. నాగార్జున సాగర్‌లోని పైలాన్ కాలనీకి చెందిన కేశవపంతుల వెంకటేశ్వర శర్మ హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్చార్జిగా పని చేస్తున్నారు. గురువారం పెద్ద కుమారుడి ఉపనయనం నాగార్జునసాగర్‌లోని పైలాన్‌కాలనీలో జరిగింది. అయితే ఆయన చిన్నకుమారుడు వాచస్పతి(18), అన్న కుమారుడు చంద్రకాంత్ (21), బావమరిది నాగరాజు(39) అదే రోజు సాయంత్రం శివాలయం వద్ద స్నానం చేసేందుకు నదిలోకి దిగారు.
అదే సమయంలో విద్యుత్ కేంద్రం నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ ప్రవాహానికి ముగ్గురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. చంద్రకాంత్ అంత్యక్రియలు నాగార్జునసా గర్‌లోని పైలాన్ కాలనీలో, వాచస్పతి, నాగరాజుల అంతిమ సంస్కారం శుక్రవారం మల్లాపూర్ వైకుంఠధామంలో జరిగాయి. వాచస్పతి మరణవార్త విని బోడుప్పల్‌లోని ఈస్ట్ బృందావన్ కాలనీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నతనం నుంచి చదువులో ప్రతిభ కనబరిచిన వాచస్పతి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి వెంకటేశ్వరశర్మ ఇంటికి చేరుకొని కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.