కోదాడ, జనవరి 4 : కోదాడ పెద్ద చెరువు ఆక్రమణలపై చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ కొరడా ఝళిపించింది. కబ్జాపై పలు దినపత్రికల్లో ప్రచురించిన వార్త కథనాలను సుమోటోగా తీసుకున్న చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని కబ్జా దారులకు నోటీసులు జారీ చేసింది. సంవత్సరం క్రితం మున్సిపాలిటీ, రెవెన్యూ, చిన్న నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే ప్రకారం చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ శిఖం అసైన్డ్ భూముల్లో 372 మంది ఆక్రమణదారులు ఉన్నారని తేల్చింది. ఈ ఆక్రమణదారులకు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. ఆక్రమణ స్థలాల్లో ఇప్పుడు క్లబ్బులు, కళ్యాణ మండపాలు అపార్టుమెంట్లతో పాటు 200 మందికి పైగా దారిద్య్ర రేఖకు దిగున ఉన్న పేదలు 50-70 గజాల్లో ఇండ్లు నిర్మించుకోవటం గమనార్హం.
726 ఎకరాల్లో 250 ఎకరాల కబ్జా..
726 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోదాడ పెద్ద చెరువులో 226 ఎకరాలు కబ్జాకు గురైందని, ప్రస్తుత అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ప్రభుత్వ భూమి 107.37 ఎకరాలు కాగా, శిఖం భూమి 413.27 అసైన్డ్ భూమి 49.04 ఎకరాలు, ఇనాం భూమి 34.32 ఎకరాలు, పట్టా భూములు 121 ఎకరాలు ఉన్నాయి.
ఆక్రమణలపై చేతులెత్తేసిన అధికారులు..
కోదాడ పెద్ద చెరువును 2010కి ముందు 319 మంది ఆ తర్వాత 53 మంది కబ్జా చేశారని అప్పటి మున్సిపల్ అధికారులు, ఆర్డీవో గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక ఇచ్చారు. అయితే చెరువు ఆక్రమణలకు గురి అవుతుంటే మున్సిపల్, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నట్టు.. ఈ కబ్జాలపై అప్పటి నుంచి పలు దినపత్రికల్లో వార్తలు వచ్చినా ఆయా శాఖల అధికారులు పట్టించుకోలేదన్న విషయం స్పష్టం అవుతోంది. అధికారులు అండదండలతోనే చెరువు కబ్జా గురైందని కోదాడకు చెందిన సామాజిక కార్యకర్తలు అప్పట్లో పలుమార్లు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
ఇండ్ల నిర్మాణానికి అనుమతులిచ్చిన మున్సిపల్ అధికారులు..
2010కి ముందు 319 మంది, ఆ తర్వాత 53 మంది మొ త్తం కలిపి 372 మంది కోదాడ పెద్ద చెరువును కబ్జా చేశారని, అందులో నిర్మాణాలకు తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఇచ్చిన నివేదిక లో మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. అయితే సదరు కబ్జాల్లో రెండు క్లబ్బులు, కళ్యాణ మండపం, మినీ మో టారు వాహనాల స్టాండ్, టీడీపీ కార్యాలయం, నివాస గృహాలకు ఎవరు అనుమతి ఇచ్చారు. గ్రీన్ ట్రిబ్యునల్ నిర్థారణ చేయాల్సి ఉంది. నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతో పాటు సీసీ రోడ్లు, వీధి లైట్లు, పైపులైన్లు వేసి పన్నులు కూడా వసూలు చేశారు. 2010కి ముందు కబ్జాకు గురైన నిర్మాణాలకు సౌకర్యాలు కల్పించిన అధికారులు నివేదికలో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు స్పష్టమవుతోంది.
నోటీసులతో బెంబేలెత్తుతున్న నిరుపేదలు..
పెద్ద చెరువు ఆక్రమణదారులకు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేయడం హర్షణీయమైనప్పటికీ కూలినాలి చేసుకొని రూపాయి, రూపాయి కూడబెట్టి 40 నుంచి 70 గజాల స్థలం కొనుక్కొని రేకుల ఇండ్లు కట్టుకున్న నిరుపేదల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నోటీసుల జారీతో వారికి నాలుగు రోజుల నుంచి కంటిమీద కునుకు లేదు. 25 మందికి పైగా ఉన్న నిరుపేదల పరిస్థితిని చూసి మానవతా దృక్పథంతో ట్రిబ్యునల్ మినహాయింపు ఇవ్వాలని సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.
నోటీసులతో భయంగా బతుకుతున్న..
నోటీసు కాయితంతో భయం భయంగా బతుకుతున్నాం.. 30 సంవత్సరాల క్రితమే 40 గజాల జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్న.. ఆక్రమించుకునే పరిస్థితి మాకు ఎక్కడిదయ్యా.. రోజూ కూలి చేసుకొని బతికేటోళ్లం.. స్థలం రిజిస్ట్రేషన్ చేసుకొని ఇల్లు కట్టుకోవడమే కాకుండా ఇంటి పన్ను, కరెంటు బిల్లు, నల్లా బిల్లు కూడా చెల్లిస్తున్నాం.
-ఆదెమ్మ, కోదాడ
45 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా..
45 సంవత్సరాల క్రితమే ఇక్కడ 50 గజాల స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నా. ముగ్గురు కొడుకులు, కోడళ్లు, మనవరాళ్లు, మనవళ్లతో ఇక్కడే ఉంటున్నాం.. కాటికి కాళ్లు చాచిన ఈ వయస్సులో ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతం..కోర్టు పెద్ద మనుసుతో ఆలోచించి న్యాయం చేయాలి.
-ఎస్కే లతీఫ్
మా మీదనుంచి బుల్డోజర్లు పోయినా కదలం..
నాలుగిళ్లలో పనులు చేసుకుని పొట్ట పోసుకునేవాళ్లం.. 40 గజాల ఇంట్లో కాళ్లు ముడుచుకొని పడుకుంటున్నం.. ఒకే కొడుకు. భర్త పోయాడు.. పని చేసుకుంటేనే బతుకు.. నోటీసు మమ్మల్ని మానసికంగా కుంగదీస్తోంది. ఇంతకంటే చెడిపోయేదేముంది.. ఇక్కడ నుంచి కదిలేది లేదు.. మా వంటిపై నుంచి.. గుడిసెలపై నుంచి బల్డోజర్లు వెళ్లినా మేం మాత్రం ఇక్కడి నుంచి కదలం.
-సుగుణ