పెన్పహాడ్, జూన్ 11 : బస్సు సర్వీసులను పెంచమంటే నీతిమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం చార్జీలు పెంచిందని తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంటు సందీప్ అన్నారు. బుధవారం ఆయన స్పందిస్తూ.. పెంచిన బస్ పాస్ ధరలను వెనక్కి తీసుకుని, విద్యార్థులకు ఉచిత బస్ పాస్లు అందజేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బస్ పాస్ చార్జీల పెంపు నిర్ణయంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తనున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు, కళాశాలలు రీ ఓపెన్ అవుతున్న సందర్భంగా బస్ పాస్ చార్జీలు పెంచి విద్యార్థులను ఈ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించిందని ఆయన దుయ్యబట్టారు.
ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 లక్షల విద్యార్థులపై అదనపు భారాన్ని మోపడమే అవుతుందన్నారు. పట్టణాలు, నగరాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తలెత్తుతున్న ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. పెంచిన అన్ని రకాల చార్జీలను వెంటనే తగ్గించాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి ఉచిత బస్ ప్రయాణం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.