యాదాద్రి భువనగిరి, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఎక్కడా అమలు చేయని దళిత బంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా అమలు చేస్తూ దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. గతంలో వెనుకబాటుకు గురైన ఎస్సీలు సర్కారు తోడ్పాటుతో ఇప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. ఈ పథకం కిందం ఒక్కో దళిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. ఇప్పటికే తొలి విడుత సమర్థంగా అమలు చేసింది. రెండో విడుతలో ఒక్కో నియోజకవర్గం నుంచి 1,100 మందికి దళిత బంధు సాయం అందించనున్నది. త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కానున్నది. భువనగిరి, ఆలేరు నియోజకవర్గంతో పాటు మునుగోడు, తుంగుతుర్తి నియోజకవర్గాల్లో రెండు మండలాల చొప్పున, నకిరేకల్‌లోని రామన్నపేట మండలానికి చెందిన ఎస్సీలకు కూడా పథకం వర్తించనున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13,200 మంది ఎస్సీలకు దళిత బంధు అందనుంది. ఇందుకు రూ.1,320కోట్ల దాకా ప్రభుత్వం నిధులు ఖర్చు చేయనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల మంది వరకు దళిత బంధు అందనుంది. ఇందుకోసం రూ.300కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనున్నది.
వెరిఫికేషన్ కమిటీలు..
మండలాల్లో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. మండలాల్లో వెరిఫికేషన్ కమిటీ ఉంటుంది. ఇందులో ఎంపీడీఓతో పాటు తాసీల్దార్, వ్యవసాయ విస్తరణాధికారి, పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడీ టీచర్ ఉంటారు. లబ్ధిదారుల జాబితాను ఈ కమిటీ పరిశీలించి అర్హులను గుర్తిస్తుంది. జాబితాను ఎంపీడీఓ రిజిస్ట్రేషన్ చేస్తారు. అక్కడి నుంచి జిల్లా అధికారులకు చేరుతుంది. ఇక్కడ పరిశీలన అనంతరం యూనిట్లను మంజూరు చేస్తారు.
తొలి విడుతలో 412 మందికి..
రాష్ట్రంలో దళిత బంధు పథకం మొదటగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అమలైంది. తుర్కపల్లి మండలంలో ఉన్న వాసాలమర్రి గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి అని అందరికీ తెలిసిందే. దీంతో గ్రామంలో ఉన్న దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని ఆదేశించారు. ఊరిలో 75 మంది ఎస్సీ కుటుంబాలను అధికారులు గుర్తించారు. ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేశారు. ఇక మొత్తం జిల్లా వ్యాప్తంగా 412 మందికి దళిత బంధు డబ్బులు గ్రౌండింగ్ అయ్యాయి. ఇందులో భువనగిరి నియోజకవర్గంలో 100 మందికి, ఆలేరులో 175, మునుగోడులో 61, నకిరేకల్‌లో 39, తుంగతుర్తిలో 38 మందికి దళిత బంధు యూనిట్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన సాయంతో ల్యాబ్, వెల్డింంగ్, కిరాణా, మెడికల్ సామన్ల డీలర్షిప్, ప్లాస్టిక్ ప్లేట్లు, క్లాస్ షోరూమ్, సెంట్రింగ్, టీ కప్పుల తయారీ తదితర వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు.
అర్హతలు ఇవీ..
దళిత బంధు పథకం దరఖాస్తు చేసుకునే వ్యక్తి దళితుడై ఉండాలి. సంబంధిత కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. తెలంగాణ రాష్ర్టానికి చెందిన వారై ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి. అర్హులైన ఎస్సీలకు ప్రభుత్వం రూ.10 లక్షల సాయం అందిస్తున్నది. ఇది పూర్తి ఉచితం. ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాల్లోనే నగదు జమ అవుతుంది.
నోడల్ ఆఫీసర్ల నియామకం..
దళిత బంధు లబ్ధిదారుల ఎంపికకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి ఒక స్పెషల్ నోడల్ ఆఫీసర్‌ను నియమించారు. దీనికి సంబంధించి బుధవారం ఇన్చార్జి కలెక్టర్ దీపక్ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరుకు డీఆర్డీఓ నాగిరెడ్డి, భువనగిరికి జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, తుంగతుర్తికి డీవీహెచ్ఓ కృష్ణ, మునుగోడుకు సీపీఓ మాన్యానాయక్, నకిరేకల్‌కు డీఎస్సీడీఓ జయపాల్‌రెడ్డిని నియమించారు. నల్లగొండ జిల్లాలో నల్లగొండకు డీహెచ్ఎస్ఓ సంగీతలక్ష్మి, మిర్యాలగూడకు ఆర్డీఓ చెన్నయ్య, దేవరకొండకు ఆర్డీఓ గోపిరామ్, నకిరేకల్‌కు డీఐసీ జీఎం కోటేశ్వర్రావు, మునుగోడుకు జడ్పీ సీఈఓ ప్రేమకర్రెడ్డి, నాగార్జునసాగర్‌కు పీడీ హౌసింగ్ రాజ్‌కుమార్‌ను నియమించారు.
రెండో విడుత ప్రక్రియ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దళిత బంధు రెండో విడుత ప్రక్రియ ప్రారంభించాం. ఇప్పటికే కసరత్తు నడుస్తున్నది. నియోజకవర్గాల మానిటరింగ్‌కు నోడల్ ఆఫీసర్లను నియమించాం. నియోజకవర్గానికి 1,100 యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు త్వరలో దళిత బంధు యూనిట్లు మంజూరు చేస్తాం.
– శ్యామ్‌సుందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, యాదాద్రి భువనగిరి