నల్లగొండ : టీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ( RTC Strike) రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ( MLC Nellikanti Satyam ) అన్నారు. నల్లగొండ బస్ డిపో వద్ద సమ్మెకు మద్దతు తెలుపుతూ కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలని తెలిపారు. ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సుల కోసం ఇవ్వరాదని స్పష్టం చేశారు. అద్దె బస్సులను, అద్దె బస్సుల డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేసి గతంలో మాదిరిగా జాతీయం చేయాలని కోరారు.
ఆర్టీసీ రక్షణ కోసం, కార్మికుల సమస్యల సాధన కోసం చేపట్టిన ఈ సమ్మెను ప్రభుత్వం జటిలం కాకుండా చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు. 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయడంతో పాటు 2025 వేతన సవరణను కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రతినెల రూ.400 కోట్లు ఆర్టీసీకి విడుదల చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి బెడ్ విన్నర్ పోస్టులను శాశ్వత ఉద్యోగాల కింద భర్తీ చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, పట్టణ కార్యదర్శి కె ఎస్ రెడ్డి, ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ నాయ కులు బి. నరేందర్, యార చంద్రయ్య, జిల్లా నాయకులు ఎన్ ఆర్ సి రాజు,టిజె రావు,డిపో నాయకులు ఏ ఎల్ స్వామి, బి శంకరమ్మ, శ్రీను కార్మికులు తదితరులు పాల్గొన్నారు.