నడిగూడెం/చిలుకూరు, సెప్టెంబర్ 24 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు బాసటగా ఉంటుందని, తమ రైతు పక్షపాత ప్రభుత్వమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం నడిగూడెం, చిలుకూరు మండలాల్లో ఆయన పర్యటించారు. నడిగూడెం మండలంలోని కాగితరామచంద్రాపురం వద్ద జరుగుతున్న సాగర్ ఎడమ కాల్వ గండి మరమ్మతులను పరిశీలించారు.
పనులను పూర్తి చేసి బుధవారం ఉదయం కల్లా నీటిని విడుదల చేస్తామని తెలిపారు. త్వరలో 1,800 మంది లష్కర్ల నియామకం చేపడుతామన్నారు. అనంతరం చిలుకూరు మండలంలో నారాయణపురం గ్రామంలో తెగిన చెరువు కట్టకు జరుగుతున్న మరమ్మతులను స్థానిక ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పరిశీలించారు. చెరువు కట్ట మరమ్మతులకు రూ.కోటీ 50 లక్షలు మంజూరు చేయించామని, పది రోజుల్లో పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
అంతకుముందు రెడ్లకుంట మేజర్‌ను పరిశీలించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించి ప్రభుత్వం రైతులందరినీ ఆదుకుంటుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ రమేశ్‌బాబు, ఎస్ఈ శివధర్మతేజ, ఈఈ సత్యనారాయణ, ఆర్డీఓ సూర్యనారాయణ, తాసీల్దార్ ధ్రువకుమార్, డీఈ స్వప్న, ఏఈ మానస పాల్గొన్నారు.