దేవరకొండ, సెప్టెంబర్ 13 : డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా దేవరకొండ మండలంలో నిర్మించిన గొట్టిముక్కల రిజర్వాయర్‌లోకి వరద నీరు చేరుతున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, మాడ్గుల, ఇరువేను ప్రాంతాల్లో ఉన్న వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో ఆ నీరంతా గొట్టిముక్కల రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.83 టీఎంసీలు కాగా ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి 300 ఎంసీఎఫ్‌టీ(0.03 టీఎంసీ)ల నీరు చేరినట్లు డీఈ కరుణాసాగర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుందని చెప్పారు. రూ.435 కోట్లతో ప్రాజెక్ట్ పనులను పూర్తి చేశారు.
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలో ఐదు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. అందులో దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామ శివారులో నిర్మించిన రిజర్వాయర్ పనులు 100 శాతం పూర్తయ్యాయి. కట్ట కింది భాగంలో గొట్టిముక్కల గ్రామానికి నీరు రాకుండ నిర్మిస్తున్న కాంక్రీట్ గోడ పనులు కొనసాగుతున్నాయి. దాంతో అధికారులు రిజర్వాయర్‌లోకి నీటిని అధికంగా నింపకుండా కొద్ది మాత్రంలో నిల్వ చేసి మిగిలిన నీటిని రెండు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. డిండి మండలంలోని సింగరాజ్‌పల్లి ప్రాజెక్ట్ పనులు 95 శాతం పూర్తి కాగా కిష్టరాంపల్లి, చింతపల్లి రిజర్వాయర్ పనులు కొనసాగుతున్నాయి.
గొట్టిముక్కల రిజర్వాయర్‌లోకి వరద నీరు చేరుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్‌లోకి నీరు చేరితే చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా లభించే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌కు అధిక నిధులు మంజూరు చేయడంతో పాటు త్వరగా పూర్తి చేసేలా కృషి చేసిన సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌కు మండల రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.