పెద్దగట్టు జాతర తొలి ఘట్టం దిష్టి పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. శనివారం రాత్రి దేవరపెట్టెను యాదవులు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చీకటాయ పాలెం నుంచి సూర్యాపేట మండలం కేసారం గ్రామానికి చేర్చారు. అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం దేవరపెట్టెను ఆదివారం అర్ధరాత్రి పెద్దగట్టుకు తీసుకొచ్చారు. భేరీ మోతలు, గజ్జెల లాగులతో యాదవ భక్తులు, కటార్ల విన్యాసాలు, ఒలింగా… ఓ లింగా నామస్మరణతో దారి పొడవునా కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా దేవరపెట్టెను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు.
– చివ్వెంల, జనవరి 22
చివ్వెంల, జనవరి 22 : పెద్దగట్టు జాతరకు సంబంధించి దిష్టిపూజా కార్యక్రమాలు ఆదివారం రాత్రి ఆచారాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతరకు పదిహేను రోజులు ముందు దేవరపెట్టెను ముందుగా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చీకటాయపాలెం నుంచి బైకాను సూర్యాపేట మండలం కేసారం గ్రామానిక్లి శనివారం రాత్రి చేర్చారు. అక్కడ పూజల అనంతరం దేవరపెట్టెను మోసుకుంటూ సంబురాలు చేసుకుంటూ కాలినడకన ఆదివారం రాత్రి పెద్ద గట్టుకు చేర్చారు.ఈ సందర్భంగా యాదవ భక్తులు గజ్జెల లాగులు, భేరీలు, అవసరాల(కటార్లు) విన్యాసాలు చేస్తూ ఒలింగా.. ఓలింగా అంటూ కేరింతలు చేస్తూ నృత్యాలతో పెద్దగట్టు ప్రాంతం మార్మోగింది. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా దేవరపెట్టెను తాకి కళ్లకు అద్దుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. సర్పంచ్ మెంతబోయిన నాగయ్య, యాదవులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమం సాగిందిలా
పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయ ప్రాంగణంలోని మండపంలో లింగమంతుల స్వామి, చౌడమ్మ ఆలయాలకు ఏదురుగా పసుపుతో రాసిన చంద్రపట్నంలో దేవరపెట్టెను ఉంచారు. అనంతరం పూజాకార్యక్రమాలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం కేసారం గ్రామానికి చెందిన మెంతబోయిన వంశస్తులు,గుంపుల తిరుమలగిరి గ్రామానికి చెందిన మున్న వంశస్తులు, తమ వెంట తెచ్చిన కొత్తమట్టి కుండల్లో బియ్యం, పసుపు వేసి బోనం వండి నైవేథ్యం పెట్టారు. మున్న వంశస్తులు వండిన బోనంను లింగమంతుల స్వామికి, మెంతబోయిన వంశస్తులు వండిన బోనాన్ని చౌడమ్మ తల్లికి రెండు కుంభాలుగా(రాశులుగా) పోశారు. రాసిలోని అన్నం ముద్దను కొద్దిగా తీసి దీపారాధనకు దీపింత(కంచుడు) తయారు చేసి దానిలో నెయ్యిపోసి దీపం వెలిగించి రాశిపై పెట్టి దేవతలకు మొక్కారు.
బైకాన్లు ముందస్తుగా మెంతబోయిన, గొర్ల,మున్న వంశస్తులకు బొట్టు పెట్టి కంకణాలు కట్టారు. రెండు రాశులనుంచి తీసిన అన్నంలో పెరుగును కలిపి ప్రసాదంగా చేసి హక్కుదారులైన యాదవ వంశస్తులకు పంచారు. అనంతరం చౌడమ్మ తల్లికి మొక్కు చెల్లించి బలిముద్దను చల్లడంతో దిష్టి పూజా కార్యక్రమం ముగిసింది. వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సోమవారం ఉదయం పెద్దగట్టుకు వచ్చే భక్తులందరికీ ప్రసాదం (భోజనాలు) పెట్టనున్నట్లు ఈఓ కుశలయ్య, ఆలయ చైర్మన్ కోడి సైదులు యాదవ్ తెలిపారు.