నల్లగొండ, అక్టోబర్ 26: 2025-27 సంవత్సరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మద్యం వ్యాపారానికి సంబంధించిన వైన్స్ టెండర్ల గడువు ఈ నెల 23తో ముగియగా దరఖాస్తులకు సంబంధించిన డ్రా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలో నిర్వహించనున్నారు. హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీ గార్డెన్స్‌లో ఉదయం 11గంటలకు డ్రా నిర్వహించనున్నందున దరఖాస్తుదారులు పది గంటలకే కేంద్రానికి చేరుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు.
జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా, మొత్తం 4906 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుం రూ.3 లక్షలు కావటంతో ప్రభుత్వానికి దరఖాస్తు ఫీజు రూపంలోనే 147.18కోట్ల ఆదాయం వచ్చింది. అయితే గతంలో బీఆర్ఎస్ సర్కార్ రూ.2 లక్షలను దరఖాస్తు రుసుముగా నిర్ణయించడంతో జిల్లా వ్యాప్తంగా 7057 దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి దరఖాస్తు రుసుము పెంచటంతో పాటు గడవును మరో ఐదు రోజులపాటు పెంచినా 4906 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇదిలా ఉండగా జిల్లాలో ఉన్న 154 ఏ4దుకాణాల్లో 34 గౌడ్స్‌కు, 14 ఎస్సీకి, 4 ఎస్టీ కులాలకు రిజర్వు చేసిన ప్రభుత్వం, మిగిలిన దుకాణాలు ఇతర వర్గాలకు కేటాయించింది.
‘లకీ’ కికు ఎవరికో..?
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 26, (నమస్తే తెలంగాణ) : వైన్స్ టెండర్లకు సోమవారం డ్రా తీయనున్నారు. ఈ నేపథ్యంలో వైన్స్ టెండర్లు ఎవరికి దకుతాయో సోమవారం తేలిపోనుంది. కలెక్టర్ హనుమంత రావు సమక్షంలో సోమవారం డ్రా తీయనున్నారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి సోమా రాధా కృష్ణ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు డ్రా ప్రారంభం కానుంది. ప్రతి దరఖాస్తుదారు ఒరిజినల్ రిపీట్ కమ్ ఎంట్రీ పాస్‌తో పాటు చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డు రుజువును తప్పనిసరిగా వెంట తేవాల్సి ఉంటుంది.
మొబైల్ ఫోన్లను హాలులోకి అనుమతించరు. ఎంపికైన దరఖాస్తుదారులు సోమవారం లేదా మంగళవారం షాపునకు సంబంధించిన 1/6వ వాయిదాను ఆన్ లైన్ ద్వారా చెల్లించి, జిల్లా ఎక్సైజ్ కార్యాలయం నుంచి షాపు కేటాయింపు నిర్ధారణ లేఖను పొందాలి. జిల్లాలో 82 వైన్స్ ఉండగా, 2776 దరఖాస్తులతో రూ. 83.28 కోట్ల ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకో దరఖాస్తు ఫీజును 3 లక్షలకు పెంచారు. దీంతో కొందరు వ్యక్తిగతంగా, మరికొందరు గ్రూపులుగా జత కట్టి దరఖాస్తు చేసుకున్నారు.
మరో వైపు ఎలాగైనా వైన్స్ దకించుకోవడానికి వ్యాపారులు ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా మద్యం వ్యాపారులు సమూహాలుగా ఏర్పడి టెండర్లు వేస్తారు. డ్రాలో షాపు దకితే సరే.. లేకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారు. ఒకవేళ అనుభవం లేని వారికి డ్రాలో షాపు దకితే, గుడ్ విల్ ఇచ్చి షాపును తమ చేతుల్లోకి తీసుకోవాలని మరికొందరు భావిస్తున్నారు. ఇందుకోసం వ్యాపారం బాగా జరిగే దుకాణాలపై ఫోకస్ పెట్టారు.