నల్లగొండ, డిసెంబర్ 30 : దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు మతతత్వ ఫాసిస్టు అయిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు దేశంలో ఉన్న అన్ని ప్రజాస్వామ్య, లౌకిక, వామపక్షాలు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో సోమవారం సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట రెడ్డి అధ్యక్షతన సీపీఐ వంద వసంతాల ఉత్సవాల సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డి.రాజా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాడు స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీతో కలిసి కమ్యూనిస్టులు పోరాటం చేశారని, అదే స్ఫూర్తితో మరోసారి పోరుబాట పట్టి ఆర్ఎస్ఎస్, బీజేపీని తరిమి కొట్టాలని అన్నారు.
వందేండ్ల కింద స్థాపించిన సీపీఐ దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని నినిదించిన మొదటి పార్టీగా పేర్కొన్నారు. భారత రాజ్యంగ నిర్మాత అయిన అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌షాను మోదీ సమర్దిస్తూ మంత్రి వర్గంలో ఉంచడం సరికాదని, వెంటనే ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కోట్లకు అధిపతులైన అంబానీ, అదానీకి అండగా ఉంటున్న మోదీ వారికి నిత్యం సంసద సృష్టించి పెట్టడంలో బిజీగా ఉన్నాడని విమర్శించారు. అనంతరం ఆ పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భారత్‌లో 1925లో ఆవిర్భవించిన సీపీఐ బ్రిటీష్ సామ్రాజ్య వాదుల కుట్ర కేసుల్లో ఇరుక్కున్న సందర్భంలో అనేక మంది సుదీర్ఘ జైలు జీవితం అనుభవించినట్లు తెలిపారు.
సాయుధ పోరాటంలో సీపీఐ చేసిన త్యాగాలు వెలకట్టలేనివని, ఆ పోరాటాల్లో 4500 మంది అమరులయ్యారని, ఆ ఫలితంగానే 1948లో తెలంగాణ భారత యూనియన్‌లో విలీనం అయినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా అంటేనే పోరాటాల ఖిల్లా అని, రావి నారాయణ రెడ్డి మొదలు..దొడ్డి కొమురయ్య వరకు ఈ జిల్లా వాసులేనని అన్నారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే దేశంలో ఉన్న ఎర్ర జెండాలన్నీ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు న్యాయబద్ధంగా చేసిన ప్రతి చట్టంలో కమ్యూనిస్టులదే ప్రధాన పాత్రగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీపీఐ నాయకులు, శ్రేణులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. కళాకారుడు నర్సింహ ఆధ్వర్యంలో పలు పాటలతో కార్యకర్తలను ఉర్రూతలూగించారు. సభకు వచ్చిన సీపీఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎర్రదుస్తులు ధరించి రావటంతో ఎన్జీ కళాశాల ప్రాంగణం ఎరుపుమయమైంది. ఈ సందర్బంగా ఆ పార్టీ నాయకులు సీనియర్ సీపీఐ నేతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాష, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవణ్ శంకర్, బాల నర్సింహ, బాగం హేమంత్ రావు, ఈటీ నర్సింహ, వీఎస్ బోస్, నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లా కార్యదర్శులు నెల్లికంటి సత్యం, గోదా శ్రీరాములు, బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, పల్లా నర్సింహా రెడ్డి, ఉజ్జిని రత్నాకర్ రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని యాదగిరి రావు, పువ్వాడ నాగేశ్వర్ రావు, కందిమల్ల ప్రతాప్ రెడ్డి, మోహినొద్దీన్, దొడ్డ నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.