సూర్యాపేట, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మన ఊరు – మన బడి పథకానికి శ్రీకారానికి చుట్టి అవసరమైన నిర్మాణాలు, వసతుల కల్పన చేపట్టింది. చాలాచోట్ల పనులు పూర్తికాగా, కొన్ని పాఠశాలల్లో మధ్యలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పాఠశాలల్లో మిగిలి ఉన్న పనులను పూర్తి చేయకుండానే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ఇతర పాఠశాలల్లో పనులను చేపడుతున్నది.
సూర్యాపేట జిల్లాలో మన ఊరు-మన బడి ద్వారా 329 పాఠశాలల్లో చేసిన పనులకు గానూ మరో రూ.18 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. అవి ఇవ్వకపోగా కొత్త కార్యక్రమం కింద జిల్లాలో రూ.21 కోట్లతో 536 పాఠశాలల్లో పనులు చేసేందుకు రూ.11 కోట్ల అడ్వాన్స్ విడుదల చేసింది. ఇతర స్కూళ్లలో పనులకు శ్రీకారం చుట్టడం వరకు బాగానే ఉన్నా, మన ఊరు – మన బడిలో భాగంగా చేపట్టిన బడుల్లో నిర్మాణాలన పూర్తిచేయడంపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. పనులు పూర్తి చేసిన చోట కాంట్రాక్టర్లు ఏడాది కాలంగా బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఫలితం ఉండడం లేదు.
ప్రభుత్వ పాఠశాల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు గానూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం తీసుకువచ్చింది. దాంతో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. అనేక స్కూళ్లు ప్రైవేటుకు ధీటుగా సకల వసతులను సమకూర్చుకున్నాయి. జిల్లాలో మొదటి విడుతలో ఎంపిక చేసిన 329 స్కూళ్లలో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్‌చాక్ బోర్డులు, పెయింటింగ్, ప్రహరీ, కిచెన్ షెడ్, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. పూర్తయిన పనులకు సంబంధించి రూ.18కోట్లు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి.
కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాదైనా బిల్లులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ అధికారులు కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ, నిధుల విడుదలకు మోక్షం కలుగడం లేదు. స్కూల్ కమిటీలు, అధికారుల ఒత్తిడితో పనులు త్వరగా పూర్తి చేశామని, ఇప్పుడు బిల్లులు ఇవ్వకపోతే తమ పరిస్థితేంటని చిన్న కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల స్కూల్ కమిటీ సభ్యులే వర్క్ చేపట్టగా, అప్పులు చేసి పనులు చేశామని వాపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మన ఊరు-మన బడి స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం తీసుకువచ్చింది. మన ఊరు-మన బడిలో భాగంగా ఎంపిక చేసిన 329 పాఠశాలల్లో 65 పాఠశాలల్లో పనులు పూర్తి కాగా, మిగిలిన వాటిలో 50 నుంచి 80 శాతం మేర పూర్తయ్యా యి. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాలు మధ్యలో ఉన్న పాఠశాలలను కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాలలో కొత్త స్కూళ్లను ఎంపిక చేసింది.
మన ఊరు-మన బడిలో ఇప్పటికే సగం మేర అయిన పనులు పూర్తి చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాలో మొదటి విడతలో 329 స్కూళ్లలో అవసరమైన మౌళిక సదుపాయలను కల్పించేందుకు గాను ఎంపిక జరిగింది. మొదటి విడతలో ఎంపిక చేసిన స్కూళ్లలో 91 ఉన్నత పాఠశాలలు, 23 ప్రాధమికోత్న పాఠశాలలతో పాటు 215 ప్రాధమిక పాఠశాలలు ఉండగా 65 పాఠశాలల్లో పనులు వంద శాతం పూర్తయ్యాయి. మిగిలిన పాఠశాలల్లో 50 నుంచి 80 శాతం పనులు పూర్తయ్యాయి. వీటికి సంబంధించి 40 కోట్ల రూపాయల అంచనాలు ఉండగా గత ప్రభుత్వం రూ.22 కోట్లు చెల్లించింది. మరో రూ.18 కోట్లు పెండింగ్‌లో ఉండగా, ఆ బిల్లులను చెల్లించకుండానే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రూ.21 కోట్ల అంచనాతో 536 పాఠశాలలను ఎంపిక చేసి రూ.11 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించింది. దాంతో తాము చేసిన బిల్లుల సంగతేంటని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన ఊరు-మన బడిలో మొదలు పెట్టి మధ్య ఉన్న పనులను అలాగే వదిలేయడంపై విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల చదువులపై రేవంత్ సర్కారు రాజకీయం చేయొద్దని, అసంపూర్తి నిర్మాణాలపై శ్రద్ధ పెట్టి వెంటనే పూర్తి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.