యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ కప్ టోర్నమెట్ పోటీలు నిర్వహిస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో మూడ్రోజులపాటు నిర్వహించనున్న సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను మంత్రి సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్టే క్రీడా రంగం కూడా ముందంజలో ఉందన్నారు. సమైక్య పాలనలో తీవ్ర నిరాదరణకు గురైన క్రీడా రంగానికి స్వరాష్ట్రంలో ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓటమి నుంచి పాఠం నేర్చుకుని మరింత పట్టుదలతో విజయం కోసం ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం కప్ పోటీలను ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ప్రారంభించారు.
బొడ్రాయిబజార్, మే 22 : తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే ఏ కార్యక్రమమైనా పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయడంలో సూర్యాపేట ముందు ఉంటుందని, ముఖ్యంగా క్రీడల నిర్వహణలో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో ప్రథమంగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సోమవారం సాయంత్రం సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టే ఈ క్రీడలు విద్యార్థులు, యువతకు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. వేసవి సెలవులు ఉన్నందున పిల్లలు ఖాళీగా ఉంటున్నారని, వారిలో క్రీడా పటిమను పెంపొందించాలనే గొప్ప ఆలోచనతో ఈ పోటీలు చేపడుతున్నారని చెప్పారు.
అలాగే విద్యకు ప్రాధాన్యం కల్పిస్తూ 1,026 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. సాగు, తాగునీరు, 24 గంటల కరెంట్‌తో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గానికి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎమ్మెల్యే కావడం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టమని చెప్పారు. జాతీయ స్థాయి క్రీడలను సూర్యాపేట వేదికగా నిర్వహించిన ఘనత మంత్రి జగదీశ్రెడ్డిదేనని అన్నారు. సీఎం కప్ క్రీడలకు ప్రభుత్వం అందించే డబ్బులు కాకుండా మంత్రి జగదీశ్‌రెడ్డి స్వతహాగా రూ. 13లక్షలు అందించడం క్రీడాకారులపై మంత్రికి ఉన్న ప్రేమకు నిదర్శనమని తెలిపారు. యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని, నేటి ఓటమే రేపటి గెలుపునకు నాంది పలుకుతుందని చెప్పారు. అనంతరం క్రీడాకారుల నుంచి వందనం స్వీకరించి, వివిధ ఆటలకు చెందిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. వాలీబాల్ ఆటను ఆడి క్రీడలను ప్రారంభించారు. మొదటి రోజు కబడ్డీ బాలుర నడిగూడెం-మద్దిరాల, బాలికలు కోదాడ-అనంతగిరి, వాలీబాల్ బాలుర తుంగతుర్తి – తిరుమలగిరి, బాలికలు కోదాడ-నూతనకల్, ఖోఖో బాలికలు నేరేడుచర్ల – సూర్యాపేట జట్లకు క్రీడలు నిర్వహించారు.
జాతీయ స్థాయిలో రాణించాలి : కలెక్టర్ ఎస్.వెంకట్రావ్
జిల్లాలోని క్రీడాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని సూర్యాపేట కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. సీఎం కప్ ఏర్పాట్లు జాతీయ స్థాయి క్రీడలకు మించి చేసిన సిబ్బందిని అభినందించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సొంతంగా అందించిన నిధుల్లో క్రీడాకారులందరికీ దుస్తులు పంపిణీ చేసినట్లు వివరించారు.
జిల్లా స్థాయి క్రీడలకు 1,036 మంది క్రీడాకారులు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో ఇటీవల నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ క్రీడల్లో గెలుపొందిన 1,036మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. మొత్తం 91జట్లు ఉన్నాయి. కబడ్డీ 330మంది క్రీడాకారులు 33 జట్లు, వాలీబాల్ 310మంది క్రీడాకారులు 31జట్లు, ఖోఖో 312మంది క్రీడాకారులు 27జట్లు, అథ్లెటిక్స్‌లో 84మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు. జిల్లా స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయిలో ఈ నెల 28 నుంచి 31వరకు జరిగే పోటీలకు పంపిస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, జడ్పీ సీఈఓ సురేశ్, జిల్లా క్రీడల అధికారి వెంకటరెడ్డి, డీఎస్పీ నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, స్థానిక కౌన్సిలర్ తాహేర్‌పాషా, ఎంపీపీ బీరవోలు రవిందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, ఎస్జీఎఫ్ సెక్రటరీ అజాంబాబా, భూలోకరావు, ఆయా మండలాల పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.