భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 27 : దివ్యాంగుల హక్కులు హరించేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని కేరళ రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రి ఆర్. బిందు విమర్శించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో దివ్యాంగుల విద్య, సాధికారత హకులు అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2016లో పార్లమెంట్లో ఆమోదం పొందిన దివ్యాంగుల హకుల చట్టం నేటికీ అమలుకు నోచడం లేదని, ఇది కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం యాక్సెసిబుల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందేగానీ దివ్యాంగుల సంక్షేమం విషయంలో పూర్తిగా వ్యతిరేకంగా పని చేస్తున్నదన్నారు. దివ్యాంగుల హకులు, వారికి కల్పించాల్సిన సదుపాయాలపై 2020లో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో ఎకడా ప్రస్తావించలేదన్నారు. నూతన సరళీకృత ఆర్థిక విధానాల అమలు పేరుతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దివ్యాంగులకు ఆశని పాశంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తూ సామాన్య ప్రజలు, దివ్యాంగుల జీవనం మెరుగు పడేందుకు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆమె కొనియాడారు.
దివ్యాంగులు బాగా చదివి ఉద్యోగ అవకాశాలు పొందడం ద్వారా గౌరవప్రదమైన జీవితం కొనసాగించవచ్చన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రధాన కార్యదర్శి మురళీధరన్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, శాస్త్రవేత్త పి. జనీల, సెయింట్ మేరీస్ విద్యాసంస్థల చైర్మన్ కేవీకే రావు, ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఎం. అడివయ్య, రాష్ట్ర కోశాధికారి ఆర్. వెంకటేశ్, టీఏఎస్ఎల్పీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నాగేందర్, అహ్మద్‌ఖాన్, రాష్ట్ర నాయకులు కె. వెంకట్, ఉపేందర్, ఆహ్వాన కమిటీ సభ్యులు ఎండీ జహంగీర్, కొండ మడుగు నర్సింహ, గూడూరు అంజిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మంచాల మధు, పగిల లింగారెడ్డి, రామచంద్రారెడ్డి, సాయమ్మ, రాజు, గణేశ్, బలేశ్వర్ వివిధ రాష్ర్టాల నాయకులు పాల్గొన్నారు.