రామగిరి, మే 2 : విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ లక్ష్యాలను సాధించే దిశలో భాగంగా స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ యోజన)ను ప్రకటించింది. ఈ పథకం కింద పలు ప్రభుత్వ పాఠశాలలను పీఎం శ్రీ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో రాబోయే ఐదేండ్లలో ఆయా పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టనుంది.
స్థానిక సంస్ధల నుంచి సేకరించిన వివరాలతో జిల్లా విద్యా శాఖ సూచనతో యూడైస్ వివరాల ఆధారంగా ఆయా జిల్లాల కలెక్టర్లు పాఠశాలలను పీఎం శ్రీకి నివేదిక పంపించారు. పక్కా భవనం కలిగి ఉండి రాష్ట్ర సగటు కన్నా మించిన విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలను పీఎం శ్రీకి ఎంపిక చేశారు. కేంద్రం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యావిధానం-2020కి అనుగుణంగా పాఠశాలలను ఎంపిక చేశారు.
నాణ్యమైన, గుణాత్మక విద్య అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేక అంశాలతో లెర్నింగ్(అభస్యన), ఓరియంటెడ్ బోధన, స్మార్ట్ క్లాసులు, ఆటబొమ్మల ఆధారంగా బోధన సాగనుంది. అలాగే మూత్రశాలలు, తాగునీరు, విద్యుత్, ఫర్నీచర్, పాఠశాలలకు రంగులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ, వంట గది, నూతన గదుల నిర్మాణం,. హైస్కూల్స్‌లో ప్రత్యేక భోజనశాలలు, డిజిటల్ తరగతులు, హరితహారం, సోలార్ ప్యానల్స్, ఎల్ఈడీ లైట్లు, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, పోషకాహరంతో పాటు పాఠశాల ఆవరణలో తోటల పెంకం వంటివి చేపట్టనున్నారు. విద్యార్థులు పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య డిగ్రీలోకి వచ్చేలోగా స్వయం ఉపాధి పొందేలా సన్నద్ధం చేయడం.
పీఎం శ్రీ పథకం కింద ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 69 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. నల్లగొండ జిల్లాలో 31, సూర్యాపేటలో 22, యాదాద్రి భువనగిరిలో 16 పాఠశాలలు. వీటిలో రాబోయే ఐదేండ్లలో ప్రతి ఏడాది రూ.40 లక్షల చొప్పున రూ.2 కోట్లు మంజూరు కానున్నాయి. అయితే ఆయా పాఠశాలలో కల్పించే మౌలిక సదుపాయాలను అనుసరించి రూ. కోటి వరకు నిధులు వచ్చే అవకాశం ఉంది.
పీఎం శ్రీ పథకానికి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 31 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో 28 ప్రభుత్వ పాఠశాలలు, నల్లగొండ, మిర్యాలగూడలోని కేంద్రీయ విద్యాలయాలు, చలకుర్తిలోని నవోదయ విద్యాలయం ఉంది. వీటిలో మౌలిక వసతులు, కంప్యూటర్, డిజిటల్ విద్య అందుబాటులోకి రానుంది. మౌలిక వసతులు, ఇతర అంశాలపై ఆయా పాఠశాలల హెచ్ఎంలతో కలిసి ప్రతిపాధనలు తయారు చేసి ఐదేండ్లలో చేయాల్సిన అభివృద్ధి, బడ్జెట్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తాం. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య నందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం శ్రీ పథకం అందుబాటులోకి తెచ్చాయి.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ