నందికొండ, డిసెంబర్ 8: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ రాయబారులు మలేషియా హైకమిషనర్ ముజఫర్ షాబిన్ ముస్తాఫా, నేపాల్ రాయబారి డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ, భూటన్ రాయబారి మేజర్ జనరల్ వెట్సోప్ నాంగ్వేల్, థాయిలాండ్ రాయబారి చావనార్ట్ తంగ్ సుపంత్, కార్యదర్శి రుచీసింగ్ బృందం నాగార్జున సాగర్ హిల్‌కాలనీలోని అంతర్జాతీయ బుద్ధిస్టు కేంద్రమైన బుద్ధవనం ప్రాజెక్టును సోమవారం సందర్శించారు. బుద్ధవనం చేరుకున్న బృంద సభ్యులకు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య శాలువా కప్పి, పూల మొక్కలతో స్వా గతం పలికారు.
బుద్ధవనంలోని ఎంట్రన్స్ ప్లాజా నుంచి మహాస్థూపం వరకు కోలాటం, డప్పు నృత్యంతో తెలంగాణ సంప్రదాయం ప్రకారం స్వాగ తం పలికారు. బుద్ధవనంలోని బుద్ధడి పాదాలకు, మహాస్థూపంలోని ఆచార్య నాగార్జునుడి విగ్రహం వద్ద వారు పుష్పాంజలి ఘటించారు. మహాస్థూపంలోని సమావేశ మందిరంలో బుద్ధవనంపై రూపొందిచిన వీడియోలను తిలకించారు. మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని బుద్ధవిహార్ సంచాలకులు బుద్ధపాల ద్వారా నిర్వహించిన ప్రత్యేక బౌద్ధ ప్రార్థనలో రాయబారులు పాల్గొన్నారు.
అనంతరం బుద్ధవనంలోని జాతకపార్కు, అవకాన బుద్ధ, మహాస్థూపం చుట్టూ ఉన్న బుద్ధవనం పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాయబారులు మాట్లాడుతూ బుద్ధవనం బౌద్ధవారసత్వ సంపదకు గుర్తుగా చరిత్రలో నిలుస్తుందన్నారు. అనంతరం లాంచీలో జాలీ ట్రిప్పుకు వెళ్లారు. బుద్ధవనం విశేషాలను ప్లీచ్ ఇండి యా ఫౌండేషన్ సీఈవో, బౌద్ధ విషయ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. కార్యక్రమంలో టూరిజం హాటల్ జీఎం నాథన్, ఏజీఎం జంగయ్య, బుద్ధవనం అధికారులు శాసన, రవిచంద్ర, శ్యామ్ సుందర్, లాంచీ యూనిట్ మేనేజర్ హరిబాబు, కమిషనర్ మేణు, ఆర్ఐ శ్రీనివాస్, టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.