దేవరకొండ, మార్చి 21 : ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా బడ్జెట్ లో మొత్తం మోసం చేశారని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ‘అభయహస్తం’ మేనిఫెస్టోతో ప్రజలను నమ్మబలికి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూడో బడ్జెట్లోనూ ఆ హామీలకు చట్టబద్ధత కల్పించకుండా, నిధులు కేటాయించకుండా ప్రజలను వంచిస్తోందని విమర్శించారు. జేమ్స్ బాండ్ల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చి, వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు మూడో బడ్జెట్లో కూడా ‘గ్యారెంటీ’ అన్న మాట లేకుండా, ‘డిక్లరేషన్’ అన్న మాట లేకుండా ప్రతి వర్గాన్ని వంచిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల చెవిలో పువ్వులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
కేవలం కుంభకోణాల కోసమే ఈ బడ్జెట్ పెట్టుకున్నరని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల అమలు ఫైలు పైన సంతకం, గ్యారంటీల గారడీతో నాలుగు కోట్ల మందికి టోపీ పెట్టారన్నారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో అత్యంత పెద్ద ఫ్రాడ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 840 రోజులు గడిచిపోయాయి. కానీ అర గ్యారంటీ కూడా అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఊసే లేదు. రూ.15 వేల రైతు భరోసా గురించి బడ్జెట్ లో ప్రస్తావనే లేదు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?, నిరుద్యోగ భృతి ఏమైందంటూ ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన సంవత్సరానికి రూ.12 వేల చొప్పున రెండు సంవత్సరాలుగా రూ.24 వేలు బాకీ ఉందని గుర్తు చేశారు. వృద్ధులకు ఇవ్వాల్సిన నెలకు రూ.4 వేల చొప్పున మొత్తం రూ.54,000 బాకీ ఎక్కడ అని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఏమైందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సంపాదనను దోచుకుంటూ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు గుప్పించారు. బలహీన వర్గాలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి, మూడు బడ్జెట్లు కలిపినా రూ.20 వేల కోట్లకు మించకుండా కేటాయించడాన్ని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, నేనావత్ కిషన్ నాయక్, మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, సీనియర్ నాయకులు గాజుల ఆంజనేయులు, నీల రవికుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, కౌన్సిలర్లు విరమోని అంజి గౌడ్, కేతావత్ రుప్లా నాయక్, పొట్ట మురళి, పొట్ట మధు, బొడ్డుపల్లి కృష్ణ, ఇమ్రాన్, ముదిగొండ హరిదాస్, జైపాల్, అంజి పాల్గొన్నారు.