యాదాద్రి భువనగిరి, జూలై 10 (నమస్తే తెలంగాణ): యాదాద్రి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నా దద్దరిల్లింది. జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, నేతలు భారీగా తరలిరావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసింది. కలెక్టరేట్ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. ‘వద్దురా నాయనా.. కాంగ్రెస్ పాలన’, ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం’, సీఎం డౌన్‌డౌన్, ‘చెట్టు మీద దొంగ కాంగ్రెస్ దొంగ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు.
కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు. అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీరుపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పాట పాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, కొలుపుల అమరేందర్, ఎనబోయిన ఆంజనేయులు, ఏవీ కిరణ్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘బస్వాపూర్’లోకి కాళేశ్వరం నీళ్లు తేవాలి: గొంగిడి
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ను కాంగ్రెస్ బద్నాం చేసే కార్యక్రమం పెట్టుకుందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద 93.3 స్కేల్లెవల్ ఉన్నా నీళ్లు తోడుకోవచ్చని, అక్కడ 98.5 లెవల్ ఉన్నాయని చెప్పారు. రోజుకు మూడు టీఎంసీల నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశమున్నా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదని, కొండపోచమ్మ, బస్వాపూర్ వరకు కాళేశ్వరం ఉందని గుర్తు చేశారు. ఎంత చెప్పినా రేవంత్‌రెడ్డికి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తలకెక్కదన్నారు. మేడిగడ్డ వద్ద ఒక్క పిల్లర్ కుంగిపోతే బాగు చేయడానికి రెండున్నరేండ్లు సరిపోలేదా? అని ప్రశ్నించారు. 31 నెలల నుంచి గాడిద పండ్లు తోముతున్నారా అని ఎద్దేవా చేశారు. బస్వాపూర్ రిజర్వాయర్‌లోకి కాళేశ్వరం నీటిని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి: పైళ్ల
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయకుండా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విమర్శించారు. ఫలితంగా లక్ష క్యూసెక్కుల నీ రు కిందకు వెళ్లిపోతోందని మండిపడ్డారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు సాగునీటి విషయంపై తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి బీడు భూములకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోయాయనే సాకుతో గోదావరి జలాలను ఎత్తిపోయకుండా రైతుల గోస పుచ్చుకుంటున్నారని మండిపడ్డారు.

సీఎంకు రైతుల ఉసురు తగులుతుంది: బూడిద
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద నీటిని ఎత్తిపోయకుండా సముద్రంపా లు చేస్తున్నారని, కాంగ్రెస్ నే తలు మాత్రం కల్లప్పగించి చూ స్తున్నారని మాజీ ఎమ్మెల్యే బూ డిద భిక్షమయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వ్యతిరేకంగా చేస్తున్న సర్కారు కుట్రలను తిప్పికొట్టాలన్నారు. యాప్ పేరుతో యూరియా కోసం ఇబ్బం ది పెడుతున్నారన్నారు. రైతు బంధు పత్తాలేదన్నారు. పండించిన ధాన్యం కొనే పరిస్థితి లేదని మండిపడ్డారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీళ్లు లేవంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు.
సీఎంను ప్రజలే మూసీలో ముంచుతరు: క్యామ
రాష్ట్రంలో పరిపాలన చేతకా సీఎం రేవంత్‌రెడ్డి పోకిరీ, బూతు మాటలు మాట్లాడుతున్నారని, ప్రజలే రేవంత్‌రెడ్డిని మూసీలో ముంచుతారని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ విమర్శించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ దొంగల చేతికి పోయిందన్నారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సింగిల్ విండో పదవులను నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రభుత్వానికి సిగ్గు ఉండాలన్నారు. హైదరాబాద్‌లో ఎన్నికలు పెట్టే దమ్ము, ధైర్యం సీఎంకు లేదన్నారు.
కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయాలి: కంచర్ల
కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలని బీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు కంచర్ల రామకృస్ణారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణకు జీవనాడి అని, అలాంటి ప్రాజెక్టును రాజకీయ కోణం లో చూడొద్దని అన్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతున్నదన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని విమర్శించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ రైతుల పంటలను కాపాడేందుకు కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
