పెద్దడిశర్లపల్లి, సెప్టెంబర్ 28 : నల్లగొండ జిల్లాతోపాటు హైదరాబాద్ జంట నగరాల ఆశల సౌధం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు గుండెకాయలాంటి సిస్టర్న్ను నాణ్యత లోపాలు వెంటాడుతున్నాయి. నిర్మాణం సమయంలో సమైక్య పాలకుల పర్యవేక్షణ లోపంతో నాసిరకంగా పనులు చేపట్డారు. దాంతో తరచుగా లీకేజీలతో పాటు ఇతర నిర్మాణాలు ధ్వంసమవుతున్నాయి.
ప్రాజెక్టు నిర్మించి 25 సంవత్సరాలలోనే ఒక్కొక్కటి శిథిలమై ఇరిగేషన్ అధికారులను కలవరపెడుతున్నాయి. అప్పటి కాంగ్రెస్ హయాంలోనే నాణ్యత లోపాలు పూర్తి స్థాయిలో బయట పడ్డా తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులుపుకున్నారే తప్ప శాశ్వత మరమ్మతులు చేపట్టలేక పోయారు. దీంతో జిల్లాకు సాగు, తాగునీటితోపాటు జంటనగరాలకు తాగునీరు అందింజే ఆశల సౌధంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
1988లో ప్రారంభం
సాగర్ వెనుక జలాల నుంచి ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా పుట్టంగండి వద్ద ఎస్ఎల్బీసీ నామకరణ చేసి 1988లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ తర్వాత 2001 సెప్టెంబర్లో చంద్రబాబు నాయడు మోటర్లను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కృషి చేయడంతో దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)గా మార్చారు.
ఇందులో భాగంగా పుట్టంగండి పంపుహౌజ్ నుంచి 80 మెగావాట్ల హెచ్పీ సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్ల ద్వారా 200 ఫీట్ల ఎత్తులోకి ఎత్తిపోసేందుకు రెండు గుట్టల నడుమ సిస్టర్న్ను 2.2 కిలోమీటర్ల పొడవునా 0.30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అప్పుడు నిర్మాణం చేపట్టిన కంపెనీ నిర్లక్ష్యంతో పనులు చేయడంతో ప్రాజెక్టు ప్రారంభించిన పది సంవత్సరాలలోపే నాణ్యత లోపాలు బయట పడ్డాయి. సిస్టర్న్ ఇన్టెక్ స్ట్రక్చర్ నుంచి రోజురోజుకూ సీపీజీ నీరు పెరుగడంతో ఇన్టెక్ స్ట్రక్చర్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో పక్కనే ఆనుకున్న రెండు గుట్టల నడుమ నిర్మించిన మట్టికట్ట కూడా కుంగి పోవడంతో తాత్కాలికంగా మట్టికట్టను వెనుక నుంచి ధృడ పర్చారు.
అప్పటీ జేపీ కంపెనీ ప్రతినిధుల సూచనమేరకు ర్యాక్ ఫిల్ డ్యామ్ ఏర్పాటు చేశారు. ఇన్టెక్ స్ట్రక్చర్ నుంచి పెద్ద ఎత్తున సీపేజీ వాటర్ బయటకు రావడంతో తాత్కాలికంగా గ్రౌటింగ్ ( సిమెంట్ లోపలికి పంపించడం) చేపట్టారు. దీంతో నాలుగు మోటార్లు నడిపితే సిస్టర్న్ ప్రమాదమని హెచ్చరిచడంతో మూడు మోటార్లు కొద్ది రోజుల పాటు నడిపించారు. దీంతో పాటు కట్టకు ఒక వైపు నిర్మించిన ప్యారా ఫిట్ వాల్ 1.7 కిలోమీటర్ల వద్ద గతంలో 40 మీటర్ల పొడవునా పడిపోగా తాజాగా 1 కిలోమీటర్ల వద్ద 50 మీటర్ల పొడవునా పూర్తిగా పడిపోయింది. కట్టకు రక్షణగా ఉండాల్సిన గోడ కూలి లోపలి భాగంలో పడిపోవడంతో నీటి ఒత్తిడికి మట్టి కట్టపై భారం పడుతుంది.
ముఖ్యంగా గతంలో మట్టి కట్ట ప్రమాదకరంగా మారిన ప్రదేశంలో ప్యారాఫిట్ వాల్ కూలిపోవడంతో తక్షణమే అధికారులు చర్యలకు దిగారు. శాశ్వత మరమ్మతులకు సమయంం పడుతున్న నేపథ్యంలో శనివారం నుంచి ఇరిగేషన్ ఉన్నతాధికారులు తాత్కాలికంగా మట్టిని బస్తాలలో నింపి కూలిన ప్రదేశంలోఅడ్డుగా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం పడిపోయిన ప్యారా ఫిట్ వాల్ గతంలో మట్టి కట్ట దెబ్బతిన్న ప్రాంతంలో కావడంతో త్వరితగతిన మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుందని అధికారుల భావిస్తున్నారు.
తిరిగి శాశ్వత మరమ్మతులకు అంచనాలు రూపొదించి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఏదైమైనా ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన ఏఎమ్మార్పీ సిస్టర్న్ రోజురోజుకు నాణ్యత లోపాలతో శిథిలం కావడం భవిష్యత్తులో ప్రాజెక్టు మనుగడే ముప్పు అని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రాజెక్టుపై చొరవ చూపి శాశ్వత మరమ్మత్తుల దిశగా అడుగులు వేయాల్సి ఉంది.