నీలగిరి, ఫిబ్రవరి 20 : కరుడు గట్టిన దొంగల ముఠా నాయకుడు, దేశవ్యాప్తంగా ఎన్నో నేరాలకు పాల్పడిన ధార్ గ్యాంగ్ లీడర్‌ను నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ గురువారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న నెల్లూరుకు చెందిన బోయిన వెంకటేశ్వర్లు మౌరిటెక్ సంస్థ యాజమాని దామోదర్‌రెడ్డి స్థలం అమ్మగా వచ్చిన డబ్బు రూ.25లక్షలు తీసుకుని చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెల్స్‌లో బయల్దేరాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని పూజిత హోటల్ వద్దకు రాగానే టిఫిన్ కోసం బస్సు ఆపారు. వెంకటేశ్వర్లు మూత్ర విసర్జన కోసం బస్సు దిగగా, బస్సులో ఉన్న 25లక్షల బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం దర్యాప్తు మొదలు పెట్టింది. ఇందుకోసం నాలుగు సీసీఎస్ బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా కొందరు వ్యక్తులు బ్యాగ్ తీసుకుని కారులో వెళ్లడం గుర్తించారు.
ఆ వ్యక్తులను పాత నేరస్తులతో పోల్చి చూడగా.. మధ్యప్రదేశ్ రా్రష్ట్రం మన్వర్ తాలుకా కేద్వా జాగీర్‌లోని రాళ్లమండల్కు చెందిన ధార్ గ్యాంగ్‌గా తేలింది. ఆ ముఠా నాయకుడు మహ్మద్ అస్రఫ్ ఖాన్ ముల్తా నీ షేక్, లైబ్ ఖాన్, అక్రమ్‌ఖాన్, మహబూబ్‌ఖాన్‌ను చోరీ చేసినట్లు గుర్తించారు. దాంతో మధ్యప్రదేశ్‌కు వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో ధార్ గ్యాంగ్ ఇండ్లపై దాడులు చేశారు. నిందితులు ముగ్గురు పరారు గానీ, ప్రధాన నిందితుడిగా మహ్మద్ అస్రఫ్ ఖాన్‌ను పట్టుకున్నారు. అతడి ఇంట్లో నగదును స్వాధీనం చేసుకున్నారు. నార్కట్‌పల్లిలో దొంగిలించిన మొత్తం నగదుతోపాటు నిందితులు చోరీ చేసిన కర్నాటకకు చెందిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసును ప్రతిష్టత్మకంగా తీసుకుని ఛేదించిన సీసీఎస్ పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశలో డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ నాగరాజు. నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్, సీసీఎస్ ఎస్ఐ శివకుమార్ పాల్గొన్నారు.