నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రాంతం భారత యూనియన్‌లో కలిసి 75 సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. మూడ్రోజుల పాటు జరిగే వేడుకల్లో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు అందరూ భాగస్వాములయ్యేలా చర్యలు చేపట్టారు. తొలిరోజు గురువారం ఉమ్మడి జిల్లా అంతటా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ సమైక్యతా ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక ఎమ్మెల్యేల సారథ్యంలో వేలాది మందితో ర్యాలీలు నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆయా కేంద్రాల్లో సమైక్యతా ర్యాలీలను చేపట్టి సభలు నిర్వహించనున్నారు. అనంతరం భోజనం అందించనున్నారు. ఒక్కో కేంద్రంలో కనీసం 15 వేల మందితో ర్యాలీ నిర్వహించేందుకు విస్తృ తంగా ప్రచారం కల్పించారు. నల్లగొండలో లక్ష్మి గార్డెన్స్ నుంచి ఎన్జీ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించి సభకు ఏర్పాట్లు చేశారు. మిర్యాలగూడలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌ డ్స్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. హాలియాలో లక్ష్మి గార్డెన్స్ నుంచి మినీ స్టేడియం వరకు, దేవరకొండలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి హైస్కూల్ గ్రౌండ్స్ వరకు, నకిరేకల్‌లో కనకదుర్గా టెంపుల్ సెంటర్ నుంచి మినీ స్టేడియం వరకు ర్యాలీలకు స్థానిక ఎమ్మెల్యేలు ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం అక్కడే సభ నిర్వహించి, భోజన వసతి కల్పిస్తున్నారు. సూర్యాపేటలో ఎన్టీఆర్ పార్క్ నుంచి కర్నల్ సంతోష్‌బాబు జంక్షన్ మీదుగా సుమంగళి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీని నిర్వహించనున్నారు. హుజూర్‌నగర్‌లో పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి ఇందిరాచౌక్ వరకు, తుంగతుర్తిలో మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్ నుంచి రామాలయం వరకు ర్యాలీలు నిర్వహించనున్నారు.
రేపు జాతీయ పతాకవిష్కరణ
వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రాల్లోని పరేడ్ గ్రౌండ్స్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, భువనగిరిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పతావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించనున్నారు. కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీ లు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొననున్నారు. ఇక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం స్వాతంత్య్ర సమర యోధులు, కళాకారులను సన్మానించనున్నారు.
ఏర్పాట్లు పరిశీలన
మిర్యాలగూడ రూరల్ : తెలంగాణ వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించే ర్యాలీకి ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పరి శీలించారు. 15 వేల మందితో ప్రభుత్వ జూని య ర్ కాళాశాల గ్రౌండ్ నుంచి ఎన్నెస్పీ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఆర్డీఓ రోహిత్ సింగ్ ఉన్నారు.
నేడు నల్లగొండలో ర్యాలీ
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు నల్లగొండ లక్ష్మీ గార్డెన్ నుంచి ఎన్జీ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి పాల్గొననున్నట్లు వివరించారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు, విదార్థులు వివిధ సంఘాలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.