రామగిరి, జూలై 29 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ, సభ్యులు పి.ఎల్.విశ్వేశ్వరావు, డాక్టర్ వారకొండ వెంకటేశ్, జ్యోత్స్నశివారెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ వర్సిటీలో పబ్లిక్ హియరింగ్ చేపట్టింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు విద్యార్థులు, అధ్యాపకులు, యూనివర్సిటీ అనుబంధ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ పలు అంశాలను, సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.
ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో జరిగిన ప్రజా విచారణలో తొలుత వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ యూనివర్శిటీ ఏర్పాటు నుంచి ప్రస్తుత పరిస్థితుల వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీకి వివరించారు. తదుపరి యూనివర్సిటీ విద్యార్థులు వర్సిటీలోని సమస్యలను విన్నవించారు. హాస్టల్స్ సమస్య, విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల కల్పనపై వివరించారు. వీసీ తీరుతో కొంతమంది విద్యార్థులు తీవ్రంగా అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సదుపాయాలతో పాటు పోటీ పరీక్షల సమాయత్తానికి వెసులుబాటు కల్పించాలని కోరారు.
కాంట్రాక్టు అధ్యాపకులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినప్పటికి తమను పట్టించుకునే వారు కరువైనట్లు తెలిపారు. తమ సర్వీసులను రెగ్యూలర్ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని విన్నవించారు. పార్టీ టైమ్ అద్యాపకులు మాట్లాడుతూ.. తమకు వేతనాలు పెంచాలని, జాతీయ దినోత్సవం (15 ఆగస్టు, 26 జనవరి, తెలంగాణ పండుగలు) రోజుల్లో సహితం వేతనం కటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ అనుబంధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రైవేట్ యూజీ, పీజీ, బీఈడీ ఇతర కళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు మాట్లాడుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ ముందు ఉంచారు. పీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో అప్పులతో కళాశాలను ముసివేసే స్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Nalgonda : ఎంజీయూ సమస్యలపై తెలంగాణ విద్యా కమిషన్ ఆరా
అనంతరం కమిషన్ చైర్మన్ ఆకుమారి మురళి మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన విశ్వవిద్యాలయాలు విద్యార్థుల అభ్యున్నతికి దోహదం చేయాలన్నారు. ఆ దిశగా భావి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత యూనివర్సిటీలపై ఉందన్నారు. ఎంజీయూ వీసీ హుస్సేన్ ఎంతో దూర దృష్టితో వర్సిటీ అభివృద్ధికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని అభినందించారు. విద్యాభ్యున్నతికి, దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే ఉత్తమ సాదనంగా, నైపుణ్యాలను పెంచి, దేశభక్తిని పెంపొందించే గురుతర బాధ్యత యూనివర్సిటీలపై ఉందన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా యూనివర్సిటీలో వీసీతో కలిసి కమిషన్ చైర్మన్, సభ్యులు మొక్కలు నాటారు.
ఈ సమావేశంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అల్వాల రవి, వర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, హాస్టల్స్ డైరెక్టర్ దోమల రమేశ్, స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డా.హరీష్ కుమార్, స్పోర్ట్స్ బోర్డు కో ఆర్డినేటర్ శివశంకర్, సీఓఈ డా.జి.ఉపేందర్ రెడ్డి. అసిస్టెంట్ సీఓఈ లక్ష్మీప్రభ, ప్రవళి, సంధ్యారాణి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాదవి, ఐక్యూఎన్ డైరెక్టర్ డా.మిర్యాల రమేష్ కుమార్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డా.పి.మద్దిలేటి, సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ డా.ఎం.జయంతి, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాల అధిపతులు, అనుబంధ కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్, హాస్టల్స్ వార్డెన్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Nalgonda : ఎంజీయూ సమస్యలపై తెలంగాణ విద్యా కమిషన్ ఆరా