రామగిరి, సెప్టెంబర్ 22 : టీఆర్ఎస్ పాలనలోనే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌దేనని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యుడిగా ఎంపికైన దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం అర్చకుడు చిల్కుమర్రి శ్రవణ్‌కుమారాచార్యులు అభినందన సభ జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మతో కలిసి శ్రవణ్కుమారాచార్యులను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలకు భిన్నంగా బ్రాహ్మణుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికతకు దర్పణం యాదాద్రి నూతన దేవాలయమని పేర్కొన్నారు. ఇతర దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదన్నారు. తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ పురాతన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ఆర్థిక భరోసా కల్పించిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో ఏ ప్రభుత్వం కల్పించని విధంగా దూప, దీప నైవేద్య పథకం కింద పనిచేస్తున్న బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ.6వేలకు పెంచారని కొనియాడారు. అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి రూ.170కోట్ల ప్రత్యేక నిధితో బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మనదేనన్నారు. అదేవిధంగా అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యుడిగా ఎంపికైన కరీంనగర్‌కు చెందిన జక్కాపురం నారాయణస్వామిని సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలాచార్యులు, డీడీఎన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహనశర్మ, అధ్యక్షుడు దౌలాతాబాద్ వాసుదేవశర్మ, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్, చెర్వుగట్టు దేవస్థానం ప్రధానార్చకుడు రామలింగేశ్వశర్మ, అర్చక, ఉద్యోగ సంఘా ల నాయకులు, బ్రాహ్మణులు పాల్గొన్నారు.