రామగిరి, ఆగస్టు 22 : ప్రకృతిని ఆరాధించే వేడుక తీజ్ పండుగ అని నల్లగొండ జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి జడ్జి డాక్టర్ డి.దుర్గాప్రసాద్ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు నిర్వహించిన తీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవితో కలిసి పూజలు చేశారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రకృతి పచ్చదనాల ఆరాధన తీజ్ అని కొనియాడారు. మానవాళి ప్రకృతితో మమేకమై జీవించడం ఆవశ్యకతను తెలియజేస్తూ శ్రావణమాసంలో మొలకలు వృద్ధికి సూచిగా జరుపుతారన్నారు. సాంప్రదాయ పూజ కార్యక్రమాల అనంతరం అతిథులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ మద్దిలేటి, ఐక్యూఎస్ డైరెక్టర్ డాక్టర్ మిర్యాల రమేశ్ కుమార్ పాల్గొన్నారు.
Ramagiri : ప్రకృతిని ఆరాధించే వేడుక తీజ్ : జడ్జి దుర్గాప్రసాద్