– నల్లగొండలో 28 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
– ఎంపీ, ఎమ్మెల్సీలు, కలెక్టర్, ఎస్పీ, డీఈఓ హాజరు
– సభలో మంత్రి కోమటిరెడ్డికి చేదు అనుభవం
రామగిరి, సెప్టెంబర్ 05 : దేశాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అమ్మా, నాన్నల తర్వాత స్థానం గురువుకి ఇచ్చారని, గురువు గొప్పతనాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి చాటి చెప్పారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా ఒక్కొటి రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. తొలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు నల్లగొండలోనే ప్రారంభమైనట్లు చెప్పారు.
నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించే బాధ్యత గురువులపై ఉందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, విద్యార్థులను ప్రత్యేకించి మారుమూల ప్రాంత విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆయన కోరారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మరో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సమాజానికి దిశా, దశ నిర్దేశం చేసేది ఉపాధ్యాయుడేనన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో ఉపాధ్యాయుల కృషి వల్లే గతేడాది కంటే ఈ ఏడాది 12 శాతం విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే ఎక్కడా లేని విధంగా భవిత కేంద్రాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు మంచి విద్యను అందిస్తే విద్యార్థుల గుండెల్లో నిలిచిపోతారన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభలో ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడే సమయానికి సభలోని ఉపాధ్యాయులు దాదాపుగా అందరూ భోజనశాలకు వెళ్లారు. దీంతో సభా ప్రాంగణం బోసిపోయింది. ఉపాధ్యాయుల తీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులంటే అంటే ఇదేనా? మీకోసం వస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ వేదికపై అసహనంగా నిలబడిపోయారు. డీఈఓ భిక్షపతి కల్పించుకుని ఉపాధ్యాయులందరూ సభా ప్రాంగణంలోకి రావాలని పలు పర్యాయాలు మైక్‌లో అనౌన్స్ చేసినప్పటికీ కొంతమంది ప్రాంగణంలోకి రాగా మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఈఓ బొల్లారం భిక్షపతి, అడిషనల్ ఎస్పీ రమేశ్, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, కమిటీ చైర్మన్ రమేశ్, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Ramagiri : దేశ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర : మంత్రి కోమటిరెడ్డి