నిడమనూరు, నవంబర్ 30 : విద్యా బుద్ధులు నేర్పి.. బావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సబ్జెక్టుకు సంబంధం లేని అశ్లీల మాటలతో అనుచితంగా ప్రవర్తించిన ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు ఆదర్శ పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఉపాధ్యాయుడి వ్యవహార శైలితో విసిగిపోయిన విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలుపడంతో శనివారం పాఠశాల ఎదుట విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చేసి నిలదీశారు.
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు దొడ్డా ఆంజనేయులు సుమారు రెండు నెలల క్రితం జరిగిన బదిలీల్లో భాగంగా వచ్చాడు. 6,7,8 తరగతుల విద్యార్థులకు సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలను బోధిస్తున్నాడు. విద్యార్థినులను తన సొంత బిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి సబ్జెక్టుకు సంబంధం లేని అశ్లీల విషయాలను మాట్లాడుతూ అనుచితంగా ప్రవర్తించడం విద్యార్థినులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.
ఇటీవల విద్యార్థినుల ప్రైవేటు భాగాల్లో శరీరాన్ని తాకుతూ పాఠ్యాంశాలను బోధించడంతో పాటు పుట్టుమచ్చలు చూపించాలంటూ మాట్లాడుతున్న తీరుతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ ఉపాధ్యాయుడు ఆంజనేయులు తీరుపై పలువురు విద్యార్ధినులు పాఠశాల ప్రిన్సిపాల్ బూరుగు నిర్మలకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు కూడా చేశారు. తల్లిదండ్రులకు విషయం తెలుపడంతో శనివారం పాఠశాల వద్దకు చేరుకుని ఎస్ఎఫ్ఐ.ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులతో ప్రిన్సిపాల్ బూరుగు నిర్మల చర్చలు జరిపి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కష్టపడి కూలినాలీ పనులు చేసుకుంటూ పిల్లలను పాఠశాలకు పంపిస్తే అసభ్యంగా ప్రవర్తించడమేంటని తల్లిదండ్రులు నిలదీశారు.
విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన ఘటనపై పాఠశాలను శనివారం మధ్యాహ్నం నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి సందర్శించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఘటన పై పారదర్శకంగా విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వాస్తవాలను వెలుగులోకి తేవాలని అక్కడే ఉన్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజుకు సూచించారు. ఎమ్మెల్యే వెంట హాలియా సీఐ. జనార్దన్ గౌడ్, ఎస్ఐ.గోపాల్ రావు, నాయకులు ఉన్నం చిన్నవీరయ్య, చేకూరి వంశీచరణ్, కుంచం సతీశ్, బొల్లం శ్రీనివాస్ యాదవ్, విశ్వనాథుల రమేశ్, శేషరాజు శ్రీనివాస్, చింతల చంద్రారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ మన్నెం శంకర్, గాయకవాడ లక్ష్మీనారాయణ తదితరులున్నారు.
విచారణ చేశాం
విద్యార్థినుల ఫిర్యాదుతో ప్రాథమిక విచారణ నిర్వహించాం. సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఉపాధ్యాయుడిని ఆదేశించాం. ఈ విషయమై ఆదర్శ పాఠశాలల ఏడీకి సమాచారం ఇచ్చాం. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం.
– ప్రిన్సిపాల్ బూరుగు నిర్మల
అసభ్య ప్రవర్తన అవాస్తవం
విద్యార్థినుల పట్ల తాను అసభ్యంగా ప్రవర్తించానన్న ఆరోపణలు అవాస్తవం. రెండు నెలల క్రితమే బదిలీపై వచ్చిన నేను చనువుగా వ్యవహరించడం వల్ల విద్యార్థినులు అపార్థం చేసుకున్నారు. నాకూ పిల్లలున్నారు.. దైవ సాక్షిగా నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. సబ్జెక్టుకు సంబంధం లేని అశ్లీల విషయాలను విద్యార్థినులతో మాట్లాడలేదు.
– దొడ్డా ఆంజనేయులు ఉపాధ్యాయుడు