నల్లగొండ, ఆగస్టు 20 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) నేతలు అన్నారు. ఈ నెల 23న యూఎస్పీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్‌లో నిర్వహించే మహాధర్నాకు సంబంధించిన గోడ పత్రికలను టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో బుధవారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూఎస్పీసీ స్టీరింగ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.వెంకట్, ఎం.సోమయ్య మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పొందుపరచిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరచడం లేదన్నారు.
నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయుల పెన్షనర్ల, వివిధ రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలకు 5,571 పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని, డీఎడ్, బీఎడ్ అర్హతలున్న ప్రతి ఎస్టీజీకి పీఎస్ హెచ్ఎం ప్రమోషన్‌కు అవకాశం కల్పించాలన్నారు. పండిట్, పీఈటీల అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జీఓ 2, 3, 9, 10 లను రద్దు చేసి జీఓ 11, 12 ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని, వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని, గురుకుల టైం టేబుల్ సవరించాలని, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గిరిజన సంక్షేమ, ఎయిడెడ్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ రాష్ట్ర నాయకులు శ్రీరాములు, హరికిషన్, రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, నర్రా శేఖర్ రెడ్డి (టీఎస్ యూటీఎఫ్), బి.వెంకటేశం, పి.వెంకులు, ఏడుకొండలు (డీటీఎఫ్), నలపరాజు వెంకన్న, జగతి, పి.రాజశేఖర్, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.