సూర్యాపేట, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ);లక్షలాది భక్తులు తరలిరానున్న పెద్దగట్టు జాతరకు పోలీస్ శాఖ సమాయత్తమైంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది. ఈ నెల నుంచి ఐదో రోజులపాటు జాతర సాగనుండగా, 1,800 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. మరో 500 మంది వలంటీర్లను నియమించారు. 60 సీసీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల మళ్లింపు, పార్కింగ్ స్థలాలతో సిద్ధం చేసిన రూట్ మ్యాప్‌ను ఎస్పీ రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ వివిధ శాఖలతో సమీక్ష నిర్వహించారు. జాతర పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా సమస్యలు తలెత్తితే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. శనివారం నుంచే అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉండాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 6న సెలవు ప్రకటించారు.
ఐదు రోజుల పాటు జరిగే దురాజ్‌పల్లి
లింగమంతుల స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి దిశానిర్దేశంతో అన్ని శాఖల అధికారులు వసతుల కల్పనలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పనులు పూర్తికాగా జాతర కోసం దుకాణాలు, అమ్యూజ్మెంట్ పార్కులు ఏర్పాటవుతున్నాయి. జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. వాహనాల దారి మళ్లింపు చర్యలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. సీసీ, డ్రోన్ కెమెరాలు వాడనున్నారు.
పార్కింగ్ స్థలాలు
జాతరకు వచ్చే భక్తుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. నాలుగు అంతకన్నా ఎక్కువ చక్రాలు గల వాహనాలకు నాలుగు పార్కింగ్ ప్రదేశాలను, ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
సూర్యాపేట మీదుగా వచ్చే వాహనాలకు ఎన్‌హెచ్-65 మీద గల హెచ్‌పీ పెట్రోల్ బంక్ నుంచి రామకోటితండాకు వెళ్లే మార్గంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలకు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు వేర్వేరుగా ఉన్నాయి.
గరిడేపల్లి, పెన్‌పహాడ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు
కలెక్టర్ కార్యాలయం వెనుక గల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
కోదాడ, మునగాల, గుంపుల నుంచి వచ్చే వాహనాలకు ఖాసింపేట గ్రామానికి వెళ్లే మార్గంలో..
మోతె, చివ్వెంల మీదుగా వచ్చే వాహనాలకు మున్యానాయక్‌తండా వద్ద(గట్టుకు వెనకాల)..
వీఐపీల వాహనాల కోసం పెద్దగట్టు తూర్పు మెట్లకు ఎదురు భాగంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
భారీ బందో బస్తు
జాతర సందర్భంగా 1800 మంది పోలీసు సిబ్బంది, 500 మంది వలంటీర్స్‌తో పటిష్టమైన బందోబస్తు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. జాతర పరిసరాల్లో పోలీసు కంట్రోల్ రూమ్, హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాలు, వాహనాల మళ్లింపు చర్యలు, బారికేడ్లు, క్యూలైన్స్, సీసీ టీవీ కెమెరాల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు ఎస్పీ సమీక్షిస్తున్నారు. జాతరలో 60 సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు వినియోగించనున్నారు.
దొంగలను పట్టించే కెమెరాలు..
ఈ సారి జాతరలో అమర్చే సీసీ కెమెరాలు దొంగలను వెంటనే గుర్తిస్తాయి. ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలను జాతర ప్రాంగణంలో అమర్చుతున్నారు. గతంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో చోరీలకు పాల్పడిన దొంగలు ఎవరైనా జాతరలో తిరిగితే వెంటనే వారిని కెమెరాలు పట్టేస్తాయి.
జాతరలో పకడ్బందీ చర్యలు
జాతరలో ఎవరికీ ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. గుట్టపైన, కింద ఐదు కిలోమీటర్ల మేర అణువణువూ నిఘా పెడుతున్నాం. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు వాడుతున్నాం. 1800 మంది పోలీసు సిబ్బందిలో 8 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 93మంది ఎస్ఐలు, 950మంది ఏఎస్ఐలు, హెచ్‌సీలు, పీసీలతోపాటు 724 మంది హోంగార్డులు, స్పెషల్ పార్టీలు, డాగ్ స్కాడ్స్ బృందాలు విధుల్లో ఉంటాయి. వీరితోపాటు అదనంగా మరో 500 మంది సిబ్బందిని సిద్ధం చేస్తున్నాం.
–రాజేంద్రప్రసాద్, సూర్యాపేట ఎస్పీ
జాతరకుఆర్టీసీ బస్సులు ప్రారంభం
సూర్యాపేట అర్బన్, ఫిబ్రవరి 3 : పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపనున్నారు. శుక్రవారం ఆర్టీసీ బస్సును డిపో మేనేజర్ సురేందర్ ప్రారంభించారు. జాతరకు 60 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే భక్తులు రెండు కిలోమీటర్లు నడువాల్సి ఉంటుందని, ఆర్టీసీ బస్సులు గుట్ట వద్దకు వెళ్తాయని చెప్పారు. ఈ సందర్భంగా యాదవులు సంప్రదాయ దుస్తులు ధరించి భేరీలు మోగిస్తూ బస్సు సర్వీసును ప్రాంరభించారు. కార్యక్రమంలో సీఐ నాగశ్రీ, మధుసూధన్, రవి కుమార్, ఏకాంబ్రం తదితరులు పాల్గొన్నారు.
వాహనాల మళ్లింపు ఇలా..