హుజూర్నగర్, మే 8: బీఆర్ఎస్ నేతలపై అధికార కాంగ్రెస్ భౌతిక దాడులకు దిగడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ప్రజా సంఘాలు, సోషల్ మీడియా, బీఆర్ఎస్ కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ సభతో కాంగ్రెస్, బీజేపీలకు భయం పట్టుకుందన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై భౌతిక దాడి వెనుక బీజేపీ నేత బండి సంజయ్, కాంగ్రెస్ నాయకుల కుట్ర ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మోదీ నేతృత్వంలోనే పని చేస్తున్నారన్నారు. రాష్టంలో బీజేపీ ఎన్ని దాడులు చేసినా ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి చేయించడం హేయమైన చర్య అన్నారు. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు పరిపాలన అందించడంలో రాష్టంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.