సూర్యాపేట జిల్లాలో వైరల్ ఫీవర్, డెంగ్యూ కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. దాదాపు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. నొప్పులతో గోస తీస్తున్నారు. గత 29 రోజుల్లోనే జిల్లావ్యాప్తంగా 406 డెంగ్యూ కేసులు నమోదయయ్యాయి. ఇక, వైరల్ ఫీవర్ కేసులు లెక్కకు అందని పరిస్థితి.
– సూర్యాపేట, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ)
వర్షాకాలం జ్వరాలు సహజమే అయినా.. ఈసారి పరిస్థితి విపరీతంగా ఉంది. గత పదేండ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు కనిపించలేదు. బీఆర్ఎస్ సర్కారు పల్లెప్రగతి పేరిట గ్రామాలకు నెలనెలా నిధులు కేటాయించి పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో వైపర్ ఫీవర్లు పెద్దగా నమోదు కాలేదు. పల్లెలు, పట్టణాల్లో దోమల మందు కూడా క్రమం తప్పకుండా చల్లేవారు. ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. దోమల మందు ఎక్కడా కొడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఫలితంగా దోమల వ్యాప్తి పెరిగి జనం జ్వరాల బారిన పడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఈ నెలలో ఇప్పటివరకు 406 డెంగ్యూ కేసులు నమోదవడం పరిస్థితిని తెలుపుతున్నది. వైరల్ ఫీవర్ కేసులకు అంతే లేదు. వాతావరణ మార్పులు, పారిశుధ్య నిర్వహణ లోపం కారణంగా పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ఏ దవాఖానలో చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి అంటూ అవస్థ పడుతున్నారు.
వైరల్ ఫీవర్లతో ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతున్న జనాన్ని ప్రైవేట్ దవాఖానలు ఆర్ధికంగా దోపిడీ చేస్తున్నాయి. జ్వరమని దవాఖానకు వెళ్లిందే ఆలస్యం అవసరం ఉన్నా, లేకున్నా అడ్డగోలు టెస్టులు రాస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా మెడిసిన్ ఇస్తున్నారు. డెంగ్యూ వచ్చిందని ప్లేట్లెట్స్ ఎక్కించాలనే పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసి దోపిడీని అడ్డుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు చేస్తూ వైద్యులను అప్రమత్తం చేస్తున్నా.. జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి.
గత పదేండ్లలో ఈస్థాయిలో జ్వరాలు లేవు. వంద మంది ఆసుపత్రికి వస్తే 95 మంది జ్వరంతోనే వస్తున్నారు. జ్వరం వచ్చిన 24 గంటల తరువాతే ఏ టెస్టు అయినా చేయాలి తప్ప వెంటనే అవసరం లేదు. కొందరు నేరుగా ల్యాబ్‌కు వెళ్లి అనేక టెస్టులు చేసుకొని రిపోర్టుల కట్టతో వస్తున్నారు.. అది కరెక్ట్ కాదు. జ్వరం వచ్చిన వెంటనే అది డెంగ్యూ అయినా సరే టెంపరేచర్‌ను బట్టి ప్రతి ఆరు గంటలకు ఒక పారాసిటమాల్ గోలి వేసి, అవసరమైతే శరీరం డీహైడ్రేషన్ కాకుండా గ్లూకోజ్ పెడితే సరిపోతుంది. ఏ జ్వరమైనా భయపడాల్సిన పని లేదు. కానీ జాగ్రత్త తప్పనిసరి. ప్రధానంగా నిల్వ నీటిలో ఉండే దోమలు కుడితే డెంగ్యూ వస్తుంది. అందుకని పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూల తొట్లు, కూలర్లు, ఖాళీ సీసాలు, టైర్లు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి.
– రామ్మూర్తి, జనరల్ ఫిజీషియన్