
రామగిరి, ఆగస్టు 3 : మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం జోడించి విద్యాబోధనలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ది హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ‘నిష్ట 2.0’ పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేసే ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, కేజీబీవీ, మోడల్, రెసిడెన్షియల్ పాఠాశాలల్లోని టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొనాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 1నుంచే శిక్షణ ప్రారంభం కాగా పర్యవేక్షణ బాధ్యతలను డీఈఓలకు అప్పగించింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు డిసెంబర్ 2019లో ప్రత్యేక శిక్షణ ఇవ్వగా కొవిడ్ నేపథ్యంలో ఆన్లైన్లో కొనసాగిస్తున్నారు.
ఇలా లాగిన్ కావాలి..
ఉపాధ్యాయులు ‘నిష్ట’ శిక్షణకు తెలంగాణ దీక్ష (డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాల్జెడ్ షేరింగ్)పోర్టల్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంది. అడ్రస్ బార్లో diksha.gov.in/ telangana అని టైప్‌చేసి ఎంటర్ నొక్కాలి. ఓపెన్ కాగానే సైన్ఇన్పై, తర్వాత రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి. అందులో మొబైల్ నంబర్/ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి పాస్వర్డ్ నమోదు చేసుకోవాలి. తర్వాత ఇయర్ బర్త్ ఎంపిక చేసుకోవాలి. పేరు, మొబైల్ నంబర్‌తోపాటు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ విజయవంతం అని వస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలోనే మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత రాష్ట్రం, మీడియం ఎంటర్ చేయాలి. లాగిన్‌లో టీచర్, స్టూడెంట్, ఇతరుల బొమ్మలు కనిపిస్తాయి. వాటిలో క్లిక్ చేయగానే జిల్లా ఇతర వివరాలు వస్తాయి. తర్వాత కోర్సు వివరాలు, మాడ్యూల్స్ కనిపిస్తాయి. ఆరుమాసాలు సాగే ఈ శిక్షణలో ప్రతి మాడు నెలలకు మూడు మాడ్యూల్స్ చొప్పున 12 మాడ్యూల్స్, ఒకటి ఆ టీచర్ సబ్జెక్టుకు సంబంధించి మొత్తం 13మాడ్యూల్స్ పూర్తి చేయాలి. ఇలా ప్రతినెలా మూడు మాడ్యూల్స్ చదివి, వాటికి సంబంధించిన పాఠాలు పూర్తికాగానే ఆన్లైన్లోనే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంది. 70శాతం సమాధానాలు సరియైనవి కాగానే ఆ టీచర్‌కు ఆ కోర్సు పూర్తిచేసిన సర్టిఫికెట్ వస్తుంది. ఇలా ప్రతినెలా శిక్షణలో కచ్చితంగా పాల్గొనాల్సి ఉంటుంది.
నిష్ట 2.0 శిక్షణ ఉపాధ్యాయులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తుంది. మూస విధానానంలో కాకుండా విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా శిక్షణ ఉంటుంది. క్షేత్ర పర్యటనలు, వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించి టెక్నాలజీ సాయంతో నైపుణ్యాలు పెంచేందుకు, పాఠ్యాంశాలకు సంబంధించిన బోధనా వనరుల(టీఎల్ఎం) రూపకల్పనకు ఉపయోగడుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు డిజిటల్ తరగతులు నిర్వహిస్తుండడంతో సైన్స్, ఇతర సబ్జెక్టుల అంశంలో యానిమేషన్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎంతో దోహదపడనున్నాయి.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నిష్ట పేరుతో ఉపాధ్యాయులకు ఆన్లైన్లో అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణలో పాల్గొనాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. 6నుంచి 12 తరగతుల వరకు బోధించే ఎస్జీటీలు తప్ప మిగిలిన ఉపాధ్యాయులంతా పాల్గొనాలి. నైపుణ్యాలను మెరుగు పరుచుకుని గుణాత్మక విద్య అందించేందుకు ఈ శిక్షణ దోహదం చేస్తుంది.