పారిశుధ్యం, పచ్చదనానికి పెద్దపీట
మొక్కల సంరక్షణలో ప్రశంసలు
శరవేగంగా పూర్తయిన పల్లె ప్రగతి పనులు
ఏకగ్రీవ పంచాయతీ అయినటువంటి గుర్రంపోడు మండల కేంద్రం కొత్తరూపు సంతరించుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నది. నెలనెలా సమకూరుతున్న నిధులతో సమస్యల పరిష్కారం దిశగా శ్రద్ధ పెట్టిన పాలకవర్గం.. అధికారుల తోడ్పాటు, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నది.
పల్లెప్రగతి పక్కాగా అమలై గ్రామంలో పచ్చదనం, పారిశుధ్యంతో పాటు రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామం
రూపురేఖలు మార్చుకుని ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
ఆహ్లాదకరంగా పల్లెప్రకృతి వనాలు..
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు ఆహ్లాదకరంగా మారాయి. పండ్లు, పూల మొక్కలతో పాటు, నీడనిచ్చే మొక్కలు నాటారు. పల్లెప్రకృతి వనాల చుట్టూ ఫెన్సింగ్, ప్రకృతి ప్రేమికుల కోసం వాకింగ్ ట్రాక్, సంరక్షణకు గేటు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు మాత్రమేగాకుండా పంచాయతీకి సమకూరిన ఆదాయంతో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా ఇద్దరిని వన సేవకులుగా నియమించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. వీటి సంరక్షణకు సిబ్బందిని నియమించారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇవ్వడంతో జీపీ సిబ్బంది గ్రామ పరిసరాలను సర్వాంగ సుందరంగా ఉంచుతున్నారు. గ్రామంలో నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్‌ల ద్వారా మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు.
అభివృద్ధే ధ్యేయం..
గ్రామం మరింత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాం. మా సంకల్పానికి తోడు ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం వరంలా మారింది. పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పంచాయతీకి ఓడీఎఫ్‌గా గుర్తింపు దక్కింది. 100శాతం ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా అవగాహన కల్పించి విజయవంతం అయ్యాం. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌తో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాం. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.
గ్రామానికి ‘పచ్చ’తోరణం
గుర్రంపోడు మండల కేంద్రం ముఖద్వారం మొదలుకుని రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామంలోకి వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నాయి. హరితహారం ప్రారంభంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మొక్కల రక్షణకు జీపీ పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ వహించడం, ట్రీగార్డులను అమర్చడంతో గ్రామానికి కొత్త రూపు తెచ్చిపెట్టాయి.
నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు..
ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్, ట్రాలీతో పారిశుధ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మురుగుకాల్వల్లో పూడికలు తీస్తూ, నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్ల వెంట బ్లీచింగ్, శానిటైజేషన్ పనులు నిర్వహిస్తున్నారు.
అభివృద్ధిలో ముందడుగు..
మండల కేంద్రంలో రూ.2లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.40వేలతో డంపింగ్ యార్డు, రూ.12లక్షలతో వైకుంఠ ధామం నిర్మించారు. రూ.22లక్షలతో రైతు వేదిక, రూ.5లక్షలతో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. నర్సరీని ఏర్పాటు చేసి 16వేల మొక్కలను పెంచుతున్నారు. సుమారు 2,400మొక్కలతో రోడ్డుకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేశారు. గ్రామంలో డ్రైనేజీ కాల్వలు ఏర్పాటు చేసి, రూ.5లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. గ్రామంలో 367విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు అమర్చారు. ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసి విద్యుత్ కాంతులు నింపారు.
గ్రామస్తుల భాగస్వామ్యంతో ప్రగతి పనులు
మా గ్రామంలో చైతన్యవంతమైన ప్రజలున్నారు. గ్రామాభివృద్ధి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా వారి సహకారం ఉంటుంది. గ్రామంలో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేశాం. ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపడుతున్నాం.
పల్లె వనం.. ప్రకృతి ఫలం
మాడ్గులపల్లి, ఆగస్టు 29 : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి వేలాదిగా మొక్కలు నాటారు. పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటి సంరక్షిస్తుండడంతో అవి ఏపుగా పెరిగాయి. రకరకాల పూల మొక్కలు కనువిందు చేస్తుండగా పండ్ల మొక్కలు కాతకొచ్చాయి. మాడ్గులపల్లి మండలం కొత్తగూడెంలోని పల్లెప్రకృతి వనంలో గతేడాది నాటిన జామ, దానిమ్మ మొక్కలు పూత పూస్తున్నాయి. బొప్పాయి మొక్కలు మూడడుగుల ఎత్తులోనే పండ్లు కాస్తూ విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ఉప్పొంగిన పాలేరు
మాడ్గులపల్లి, ఆగస్టు 29 : పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తడంతో ఉప్పొంగుతున్నది. కల్వెలపాలెం చెక్ డ్యాం వద్ద పాల
నురగలాంటి దృశ్యం చూపరులను ఆకట్టుకుంటున్నది.