బొడ్రాయిబజార్, ఆగస్టు 20 : శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాల్లో, నివాసాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. సూర్యాపేటలోని సంతోషిమాత దేవాలయంలో పూజలు నిర్వహించారు. భక్తులు సమర్పించిన పట్టు వస్ర్తాలను అమ్మవారికి అలంకరించి కుంకుమార్చన చేశారు. అమ్మవారి సన్నిధిలోని శ్రీచక్రానికి పూజలు నిర్వహించి సంతోషిమాతకు ఉద్యాపన వ్రతం చేశారు. అమ్మవారికి ఒడి బియ్యం పోయడంతోపాటు మహిళలు పెద్ద సంఖ్యలో వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష, కార్యదర్శులు నూకా వెంకటేశంగుప్తా, బ్రాహ్మండ్లపల్లి మురళీధర్, పాలవరపు రామ్మూర్తి, విద్యాసాగర్, ప్రకాశ్, బ్రహ్మయ్య, రామయ్య, అశోక్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో : పద్మశాలీ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో సంఘం పట్టణ అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్‌రావు నివాసంలో పద్మశాలీ మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. కార్యక్రమంలో సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు కునుకుంట్ల శారదాదేవి, కార్యదర్శి యలగందుల సుదర్శన్, నాయకులు పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : రాజానాయక్తండాలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. అనంతరం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అలాగే, మండలంలోని పలు ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ లునావత్ రమేశ్‌నాయక్, సైబరాబాద్ సీఏఓ గీత, సర్పంచ్ లునావత్ అశోక్, ఆలయ కమిటీ సభ్యులు, వికాస తరంగిణి
కార్యకర్తలు
తుంగతుర్తి : మండల కేంద్రంలోని పలు ఆలయాలు, ఇండ్లల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతం ఆచరించారు. బియ్యం, పప్పు, బెల్లంతో ప్రసాదం తయారు చేసి లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు.
ఇష్టకామేశ్వరికి పంచామృత అభిషేకాలు
మేళ్లచెర్వు : మండల కేంద్రంలోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి, వనదుర్గ ఆలయాల్లో ఇష్టకామేశ్వరి, వనదుర్గ అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు, అష్టోత్తర సహస్రనామావళితో కుంకుమార్చన జరిపించారు.
మఠంపల్లి : మండల కేంద్రంలోని కనకదుర్గమ్మ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, వరలక్ష్మీ పూజ అనంతరం నీరాజన మంత్ర పుష్పం సమర్పించారు.
నేరేడుచర్ల : మండలంలోని ఆలయాలు భక్తులతో కిటకటలాడాయి. పట్టణంలోని విజయదుర్గ ఆలయంలో దుర్గామాతను పుష్పాలతో అలంకరించగా, భక్తులు పూజలు చేశారు. అన్నపూర్ణ్ణావిశ్వేశ్వర ఆలయంలో వరలక్ష్మీ వ్రతంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గరిడేపల్లి : మండల కేంద్రంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. అనంతరం మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
చింతలపాలెం : మండలంలోని పలు ఆలయాల్లో మహిళా భక్తులు సామూహిక వరలక్ష్మీవ్రతాన్ని ఆచరించారు. అర్చకులు గణపతి, వరలక్ష్మీ పూజలు చేసి నీరాజన మంత్ర పుష్పములు సమర్పించారు.
మునగాల : మండల కేంద్రంలోని కనకదుర్గ, రామలింగేశ్వర, హనుమాన్ దేవాలయాల్లో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.