సూర్యాపేట, ఆగస్టు 7 : యాసంగిలో కొనుగోలు చేసిన ప్రతి ధాన్యం గింజకూ ప్రభుత్వం వందశాతం డబ్బుల చెల్లింపులను పూర్తి చేసింది. యాసంగిలో జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6,61,443 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా వాటికి రూ.1248,68,56,424 నగదును రైతుల ఖాతాలో జమ చేసింది. అయితే కొనుగోలు కేంద్రాలు సరైన పత్రాలు ఇవ్వక పోవడంతో కొంత ఆలస్యమైన రైతులందరికీ విజయవంతంగా చెల్లింపులు పూర్తి చేశారు.
కరోనా మూలంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అయినప్పటికీ ప్రభుత్వం రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచింది. కాళేశ్వరం జలాలు, కృష్ణా, మూసీ నీరు సమృద్ధ్దిగా అందించి రైతులకు నీటి కష్టాలు తీర్చింది. పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడమే కాకుండా ప్రతి పైసా రైతుల ఖాతాలో జమ చేసింది. జిల్లా వ్యాప్తంగా 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 81,843 మంది రైతుల నుంచి 6,61,443 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 6,55,472 మెట్రిక్ టన్నుల ధాన్యం గ్రేడ్-‘ఏ’ మద్దతు ధరకు కొనుగోలు చేశారు. అంటే క్వింటా కు రూ. 1,880 చెల్లించింది. దీంతో ప్రభుత్వం కొనుగోలు చేసిన 6,61,443 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ. 1248,68 కోట్లు చెల్లించింది. వీటిలో రూ. 1,237.53 కోట్ల మద్దతు ధర రైతులకు చెల్లించినవే. అంటే 99.10 శాతం ధాన్యానికి మద్దతు ధర కల్పించింది. కేవలం 5,970 మెట్రిక్ టన్నులకు మాత్రమే కామన్ మద్దతు ధర రూ. 1868 ఇవ్వడం జరిగింది.
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాల్సి ఉంది. ఆ సమయంలో ఎలాంటి తప్పు దొర్లినా నగదు చెల్లింపులో ఆలస్యమవుతుంది. సూర్యాపేట జిల్లాలో సైతం రూ. 1,245 కోట్లు వేగంగా చెల్లింపు జరగగా ఎంట్రీ సమయంలో జరిగిన కొన్ని పొరపట్ల వల్ల రూ.3.5 కోట్లు కొంత ఆలస్యమైంది. రైతులు పనిచేయని బ్యాంక్ ఖాతా నంబర్లు ఇవ్వడం, పేరు తప్పుగా పడడం వంటి సమస్యలను ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సరిచేసుకుంటూ పూర్తి స్థాయిలో చెల్లింపులు చేశారు. దీంతో రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూశారు.
యాసంగి కొనుగోళ్లు వేగంగా పూర్తి చేసి అదే స్థాయిలో చెల్లింపులు చేశాం. సాంకేతిక సమస్యల వల్ల చివరిలో కొంత మందికి చెల్లింపులో ఆలస్యమైంది. వాటిని పరిష్కరించి వెంటనే జమ చేశాం. జిల్లా వ్యాప్తంగా 81,843 మంది రైతుల నుంచి 6,61,443 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా వాటికి రూ. 1248.68 కోట్లు చెల్లించాం.