హుజూర్నగర్, నవంబర్ 26 : ప్రపంచ దేశాల్లోని అన్ని రాజ్యాంగాల్లో కెల్లా భారత రాజ్యాంగం సుదీర్ఘమైనది, అత్యున్నతమైనదని ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీనా అన్నారు. బుధవారం హుజూర్నగర్ స్థానిక కోర్టు ప్రాంగణంలో న్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడారు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26 వ తేదీన ఆమోదించబడిన సందర్భంగా ఈ రోజును న్యాయ దినోత్సవంగా దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో త్యాగధనుల కృషి ఫలితంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చివేసి భారతానికి స్వాతంత్ర్య ఫలితాలు అందించారని న్యాయమూర్తులు స్వాతంత్ర్య సమరయోధులను కొనియాడారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారత రాజ్యాంగ రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను నియమించి ఆ కమిటీ రూపొందించిన సుదీర్ఘమైన, లిఖిత పూర్వకమైన ప్రపంచ దేశాల్లోని ఇతర రాజ్యాంగాల్లో కెల్లా మేటి అయిన రాజ్యాంగాన్ని నవంబర్ 26వ తేదీన ఆమోదించారని వారు గుర్తు చేశారు.
భిన్నత్వంలో ఏకత్వం, ఉమ్మడి పౌరసత్వం, సార్వభౌమాధికార, గణతంత్ర, లౌకిక, సామ్యవాదం లాంటి అత్యున్నతమైన లక్షణాలు భారత రాజ్యాంగంలో రూపొందించబడ్డాయన్నారు. కానీ కొన్ని పరిస్థితుల మూలంగా రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టానికి లోబడి శాంతియుతంగా సామరస్యపూర్వకంగా తమ జీవనాన్ని కొనసాగించాలని న్యాయమూర్తులు సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చనగాని యాదగిరి, కాల్వ శ్రీనివాసరావు, షేక్ సైదా హుస్సేన్, భూక్య నాగేశ్వరరావు, కీతా వెంకటేశ్వర్లు, బానోతు శంకర నాయక్, జక్కుల వీరయ్య, మీసాల అంజయ్య, నాగరాజు నాయక్, బుడిగ నరేష్, నారాయణరెడ్డి, న్యాయ సేవ అధికార సంస్థ సిబ్బంది అనిత, సుశీల, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.